దేశ ప్రధాని అయితేనేం.. మాస్క్ లేకుంటే ఫైన్ కట్టాల్సిందే..!

Thailand's prime minister fined for breaking face mask rule.థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కూడా మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు అంటే మన కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 3:12 AM GMT
Thailand PM

పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు అన్ని దేశాలూ కఠిన చర్యలకు ఉపక్రమించాయి. థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కూడా మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు అంటే మన కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచే ఇది అమలులోకి వచ్చింది. సోమవారం కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌పై సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని చాన్‌–ఓచా ఫోటో ఆయన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. అందులో ఇతరులంతా మాస్క్‌ పెట్టుకోగా.. ప్రధాని మాత్రం మాస్కు లేకుండా కనిపించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో ఉల్లంఘనకు పాల్పడ్డానేమో చూడాలని ప్రధాని నేరుగా బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ను కోరారు. నిబంధనల ప్రకారం ఇది ఉల్లంఘనే కాబట్టి మేయర్‌.. ప్రధానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీసు కమిషనర్‌ వెళ్లి ప్రధానికి జరిమానా విధించారు. అయితే ప్రధానిది తొలి ఉల్లంఘన కాబట్టి ప్రస్తుతానికి 6 వేల భట్‌లు అంటే 14 వేల రూపాయలు జరిమానా వసూలు చేశామని గవర్నర్‌ తెలిపారు. దర్యాప్తు అధికారులు జరిమానా మొత్తాన్ని నిర్ధారిస్తారని తెలిపారు. సరిగ్గా రెండు వారాల క్రితం నార్వేలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ తన 60వ పుట్టినరోజు వేడుకను సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు. ఆ కార్యక్రమంలో నిబంధనలను ఉల్లంఘించి 13 మంది పాల్గొన్నారు. ఈ విషయం బయటకు రావడంతో ప్రధాని క్షమాపణలు చెప్పారు. భౌతిక దూరం ఆంక్షలకు విరుద్ధంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను దాదాపు రూ.1.75 లక్షల జరిమానా అంటే 20వేల నార్వేజియన్‌ క్రోన్‌ లు చెల్లించారు.


Next Story