గ‌వ‌ర్న‌ర్ ఆఫీసు ముందు పార్క్ చేసిన కారులో 10 మృత‌దేహాలు

Ten bodies left in SUV outside Mexican state governor's office.గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు నిలిపిన ఉంచిన ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2022 3:49 PM IST
గ‌వ‌ర్న‌ర్ ఆఫీసు ముందు పార్క్ చేసిన కారులో 10 మృత‌దేహాలు

గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు నిలిపిన ఉంచిన ఓ కారులో 10 మృత‌దేహాల‌ను క‌నుగొన్నారు. ఈ ఘ‌ట‌న మెక్సికో దేశంలోని జ‌కాటికాస్ రాష్ట్రంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది.

వివ‌రాల్లోకి వెళితే.. జ‌కాటికాస్ ప‌ట్ట‌ణంలోని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు ఉన్న ఖాళీ ప్ర‌దేశంలోని క్రిస్మస్ చెట్టు పక్కన అనుమానాదాస్ప‌దంగా ఓ ఎస్‌యూవీ కారు పార్క్ చేసి ఉండ‌డాన్ని భ‌ద్ర‌తా సిబ్బంది గ‌మ‌నించారు. కారు ద‌గ్గ‌రికి వెళ్లి చూడ‌గా.. అందులో 8 మంది పురుషులు, ఇద్ద‌రు మ‌హిళలు మొత్తం 10 మృత‌దేహాలు అందులో క‌నిపించాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సీసీ కెమెరాల ఆధారంగా ఇద్ద‌రు నిందితుల‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఎందుకు వారు ఇలా చేశారు అన్నది తెలియాల్సి ఉంది. చ‌నిపోయిన వారు ఎవ‌రు అన్న వివ‌రాలు కూడా ఇంకా తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై గవర్నర్ డేవిడ్ మోన్రియల్ అవిలా స్పందించారు. భ‌యంక‌ర‌మైన వార్త‌తో రోజు ప్రారంభ‌మైంద‌న్నారు. ఆఫీసు ముందు కారు పార్క్ చేసిన‌ ఇద్ద‌రిని అరెస్టు చేశార‌న్నారు. మృత‌దేహాల‌పై గాయాలున్నాయ‌న్నారు.

రాష్ట్ర చీఫ్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్సిస్కో మురిల్లో ప్రకారం.. పది మందిలో ఏడుగురుని గొంతు నులిమి చంపిన‌ట్లు తెలిపారు. శవపరీక్ష నివేదికను ఉటంకిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. వారిలో ఆరుగురికి పాదాలు మరియు చేతులపై గాయాలు ఉన్నాయని, వారికి సంకెళ్ళు వేశార‌న్నారు. వారిలో ఒక‌రిని దారుణంగా హింసించిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఐదు మృతదేహాలలో ముగ్గురిని గతంలో డ్రగ్స్ మరియు దోపిడీ ఆరోపణలపై అరెస్టు చేసినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ తెలిపారు. మృతదేహాన్ని పారవేసేందుకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

కాగా.. జ‌కాటికాస్ రాష్ట్రంలో డ్ర‌గ్ గ్యాంగ్‌ల మ‌ధ్య వార్‌లు న‌డుస్తుంటాయి. అందులో భాగంగా ఈ హ‌త్య‌లు జ‌రిన‌ట్లు తెలుస్తోంది. ఇక మెక్సికోలో నరహత్యలను గణనీయంగా తగ్గించడంలో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ విఫలమయ్యారని అక్క‌డి మీడియా తెలిపింది. 2020లో 32,814 హ‌త్య‌లు జ‌రుగగా.. 2021 మొద‌టి 11 నెలల్లో 31,615 హ‌త్య‌లు జ‌రిగాయి. కేవ‌లం 3.6 శాతం మాత్ర‌మే హ‌త్య‌లు త‌గ్గాయ‌ని చెప్పింది. ఒబ్రడార్ పరిపాలన నరహత్యల పెరుగుదలను అరికట్టగలిగిందని.. అయితే వాటిని పెద్దగా తగ్గించలేకపోయిందని తెలిపింది.

Next Story