ఇండియన్ ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు.. కార్లు తీసుకెళ్లారు..!
Taliban Searched Closed Indian Consulate In Kandahar.తాలిబన్లపై అందరికి అనుమానాలే. వారు పైకి చెప్పేది
By తోట వంశీ కుమార్ Published on 20 Aug 2021 12:19 PM ISTతాలిబన్లపై అందరికి అనుమానాలే. వారు పైకి చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. ఆఫ్ఘన్‌నిస్థాన్ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు ఇక యుద్ధం ముగిసిందని అందరనీ క్షమించేశాం ఇస్లాం చట్టాల ప్రకారం మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదో అప్పుడే ప్రతి ఇంటిని గాలిస్తున్నారు. అక్కడ ఉన్న భారత కాన్సులేట్లను కూడా తనిఖీ చేశారు. కాందహార్, హీరత్ నగరాల్లో ఉన్న భారతీయ దౌత్యకార్యాలను బుధవారం తాలిబన్లు ముట్టడించినట్లు తెలుస్తోంది.
కీలకమైన దౌత్య పత్రాల కోసం తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించిన్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కీలక పత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని వారు ఇలా ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో ఆ కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌కు చెందిన నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. కాబూల్‌లో అదనంగా మరో ఎంబసీ ఉన్నది.
కాందహార్, హీరత్‌తో పాటు మజార్ యే షరీఫ్ పట్టణంలోనూ భారతీయ కాన్సులేట్ ఉంది. కాగా.. తాలిబన్ మిలిటెంట్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే మజార్ యే షరీఫ్ కాన్సులేట్‌ను మూసివేశారు. గత ఆదివారం తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తరువాత పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారడంతో భారత్.. ఆఫ్గాన్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చింది.