దారుణం.. మృత‌దేహాల‌ను వాటికి వేలాడదీస్తున్న తాలిబన్లు..!

Taliban hang dead body in public.ఆప్ఘాన్‌లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమ అరాచక

By అంజి  Published on  26 Sep 2021 6:12 AM GMT
దారుణం.. మృత‌దేహాల‌ను వాటికి వేలాడదీస్తున్న తాలిబన్లు..!

ఆప్ఘాన్‌లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమ అరాచక పాలనను అమలు చేస్తున్నారు. గతంలో లాగా కాదు.. తాము మారమని, మానవ హక్కలను గౌరవిస్తామని నీతులు చెప్తూనే అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. తాలిబన్ల క్రూరత్వాన్ని చూసి అక్కడి ప్రజలు జంకుతున్నారు. తాజాగా హెరాత్‌ నగరంలోని ఓ జంక్షన్‌ దగ్గర క్రేన్‌ సాయంతో ఓ మృతదేహాన్ని తాలిబన్లు వేలాడదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అయితే ఓ తండ్రి, కొడుకులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన నలుగురు దుండగులను హతమార్చామని, ఒక మృతదేహాన్ని ఇక్కడ వేలాడదీశామని, మరో మూడు మృతదేహాలను ఇతర పట్టణాల్లో వేలాడదీస్తామని తాలిబన్లు అన్నారని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. నలుగురు కిడ్నాపర్ల నుంచి తండ్రి, కొడుకులను రక్షించేందుకు దుండగులను మట్టుబెట్టామని హెరాత్ జిల్లా పోలీస్ చీఫ్ జియావుల్‌ హాక్‌ జలాని తెలిపారు. ఈ ఘటనలో ఓ తాలిబన్‌ ఫైటర్‌తో పాటు ఓ పౌరుడికి గాయాలయ్యాయని తెలిపారు. అలాగే నలుగురు కిడ్నాపర్లు ఎదురు కాల్పుల్లో మరణించారని చెప్పాడు.

ఇదిలా ఉంటే హత్యల బహిరంగ ప్రదర్శనకు సంబంధించి తాలిబన్లు అధికారిక ప్రకటన చేయలేదు. తమ మునుపటి పాలనను తిరిగి అమలు చేస్తామని ఇటీవల తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో తాలిబన్ అధికారి మొహమ్మద్ యూసుఫ్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లామిక్‌ నిబంధనల ప్రకారం కొత్త పాలన ఉల్లంఘించినవారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అలాగే ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన హత్య చేయబడతాడని, అయితే హత్య ఉద్దేశపూర్వకంగా లేకపోతే ఇతర శిక్షలు విధిస్తామని చెప్పాడు. దొంగతనం చేస్తే చేతులు నరికివేయబడతాయని, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టడం జరుగుతుందని యూసఫ్‌ చెప్పాడని న్యూయార్క్‌ పోస్ట్ తెలిపింది. మరోవైపు ఆప్ఘాన్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Next Story