స్వలింగ వివాహాలకు ఒకే చెప్పిన స్విట్జర్లాండ్‌ ప్రజలు..!

Switzerland Votes To Make Same-Sex Marriage Legal by Near Two-Thirds Majority.స్విట్జర్లాండ్‌లో తాజాగా స్వలింగ వివాహాల

By అంజి  Published on  28 Sep 2021 2:30 AM GMT
స్వలింగ వివాహాలకు ఒకే చెప్పిన స్విట్జర్లాండ్‌ ప్రజలు..!

స్విట్జర్లాండ్‌లో తాజాగా స్వలింగ వివాహాల, పౌర వివాహాల చట్ట బద్దతకు ఆ దేశ ప్రజలు ఒకే చెప్పారు. ఇటీవల ఆ దేశ వ్యాప్తంగా రెఫరెండం నిర్వహించారు. ఈ రెఫరెండంలో ఎక్కువ శాతం మంది స్వలింగ వివాహాలు, పౌర వివాహాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మూడింట రెండు వంతుల మంది మెజార్టీ ప్రజలు స్వలింగ వివాహాలకు మద్దతు తెలిపారు. ఇక త్వరలోనే స్వలింగ వివాహాలు, పౌర వివాహాలు చట్ట బద్దంకానున్నాయి. పశ్చిమ ఐరోపాలో స్వలింగ వివాహాలను చట్టబద్దం చేసిన చివరి దేశాల్లో ఒకటిగా స్విట్జర్లాండ్‌ నిలవనున్నది. స్విస్‌ ఫెడరల్‌ ఛాన్సలరీ అందించిన రిజల్ట్స్‌ ప్రకారం.. స్విట్జర్లాండ్‌ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 64.1 శాతం మంది ఓటర్లు స్వలింగ వివాహానికి మద్దతుగా ఓటు వేశారు. ఎక్కువ మంది ప్రజలు స్వలింగ వివాహాలకు ఓటు వేయడంతో బెర్న్‌ నగరంలోని స్వలింగ సంపర్కులు రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. కాగా స్వలింగ జంటలకు పౌర వివాహాం చేయడమనేది 'సమానత్వానికి మైలురాయి' వంటిదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. అయితే స్విట్జర్లాండ్‌ రైట్‌ వింగ్‌ స్విస్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన ప్రజాభిప్రాయ కమిటీ సభ్యురాలు మోనికా రూగెగర్‌ స్వలింగ వివాహాల చట్టబద్దంపై నిరాశ వ్యక్తం చేసింది.

ఇది ప్రేమ, భావాల గురించి కాదని.. పిల్లల సంక్షేమం గురించని అన్నారు. ఇక్కడ పిల్లలు, తండ్రులు ఓడిపోయారని ఆమె ఓ ప్రముఖ పత్రికతో అన్నారు. సవరించనున్న చట్టం ప్రకారం స్వలింగ జంటలు వివాహాం చేసుకోవడానికి, అలాగే పిల్లలను దత్తత తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వివాహిత లెస్బియన్ జంటలు స్పెర్మ్ డొనేషన్‌ ద్వారా పిల్లలను కలిగి ఉండటానికి అనుమతించబడుతుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తుల యొక్క విదేశీ జీవిత భాగస్వాములు పౌరసత్వం పొందడాన్ని కూడా ఇది సులభతరం చేస్తుంది. స్విట్జర్లాండ్‌ న్యాయశాఖ మంత్రి కరిన్ కెల్లర్‌ సుట్టర్‌ మాట్లాడుతూ.. స్వలింగ్ వివాహాల చట్టబద్దతకు సంబంధించిన కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదే ప్రజాభిప్రాయ సేకరణలో 64.9 శాతం మంది ఓటర్లు మూలధన లాభ పన్నును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను తిరస్కరించారు.

Next Story