అంతరిక్ష పరిశోధనకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు త్వరలోనే భూమి మీదకు చేరనున్నారు. ఆమెతో పాటు అక్కడ ఉన్న బుచ్ విల్మోర్ కూడా కిందకి రానున్నారు. మార్చి మధ్యలో వారిద్దరిని భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని మంగళవారం నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరి గత వారానికి ఎనిమిది నెలలు పూర్తయ్యాయి.
గత ఎనిమిది నెలలుగా ISSలో భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని భూమికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు పలు మార్లు నాసా చేపట్టిన అవి విఫలమయ్యాయి. అయితే, ఎట్టకేలకు ఈ వ్యోమగాములు భూమి మీదకు తిరిగి రానున్నారు. వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సహాయం తీసుకుంటోంది. స్పేస్ ఎక్స్ 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను ఉపయోగించనున్నట్టు నాసా తెలిపింది.
కాగా, సునీతా విలియమ్స్, బుచ్ మిల్ మోర్ 2024 జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అంతరిక్షానికి మానవసహిత రాకెట్ ప్రయాణానికి సంబంధించిన ప్రయోగంలో భాగంగా ఎనిమిది రోజుల టూర్ కోసం స్టార్ లైనర్ బోయింగ్ రాకెట్‌లో చేరుకున్నారు. అంతరిక్షానికి చేరుకున్న తర్వాత సునీతా బృందం ప్రయాణించిన స్టార్ లైనర్ బోయింగ్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలతో అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్ చిక్కుకున్నారు.