కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. పేధ-ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే.. అందరికి అహగాహాన కల్పించాల్సిన ఆరోగ్యశాఖా మంత్రి కరోనా బారిన పడ్డారు. మామూలుగా అయితే.. ఇది పెద్ద విషయం కాదు కానీ.. సదరు మంత్రి గారు మంత్రించిన కషాయం తీసుకున్నారు. అయినప్పటికి మంత్రికి కరోనా సోకింది. దీంతో నెటీజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
మన పొరుగున ఉన్న శ్రీలంక దేశ ఆరోగ్య శాఖ మంత్రి పవిత్ర వానియరాచ్చి.. ఇటీవల కరోనాతో పోరాడేందుకు ఓ 'మ్యాజిక్ సిరప్' (మహిమగల మంత్రించిన కషాయం) తీసుకున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తాయి. ప్రజలకు అవగాహాన కల్పించాల్సిన మంత్రి ఇలా చేస్తారా అని నెటీజన్లు కూడా ఏకిపారేశారు. మంత్రిగారే తీసుకోవడంతో.. అధికారులతో పాటు ప్రజలు కూడా ఆ కషాయం కోసం క్యూ కట్టారు. ఇది లభించే కగల్లె టౌన్‌లో వేలసంఖ్యలో గుమిగూడారు. ఇదంతా గతేడాది డిసెంబరులో జరిగింది.
తాజాగా సదరు మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే మంత్రి.. తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని కోరారు. ఇక ఈ విషయం తెలిసిన నెటీజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మంత్రికి కరోనా పాజిటివ్ రావటంతో మహిమలు పనిచేయలేదనుకుంటా..మరోసారి ప్రయత్నించకూడదూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.