2019లో శ్రీలంకలో తీవ్రవాదుల దాడుల తర్వాత ముస్లింల విషయంలో ఆ దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలలో చాలా వరకూ మార్పు వచ్చింది. ఈస్టర్ పండుగ సందర్భగా చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల ముస్లింలపై సింహళీయులు దాడి చేయడం కూడా జరిగింది. తాజాగా శ్రీలంక ప్రభుత్వం దేశంలో మహిళలు బురఖాలు ధరించడంపై నిషేధం విధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. వేయికి పైగా ఉన్న ఇస్లామిక్ పాఠశాలలను కూడా మూసివేయాలని ప్రజాభద్రత శాఖ మంత్రి శరత్ వీరశేఖర తెలిపారు.
ఈ నిషేధాజ్ఞలకు సంబంధించిన ఆదేశాలపై తాను సంతకం చేశానని, క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చాక నిషేధాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పట్లో ముస్లిం మహిళలు, బాలికలు బురఖాలు ధరించేవారు కాదని, ఇస్లాం అతివాదం కారణంగానే బురఖాలు వచ్చాయని అన్నారు. తాము ఈ వైఖరిని తప్పకుండా నిషేధిస్తామని స్పష్టం చేశారు. శ్రీలంకలో బురఖాలపై 2019లో తాత్కాలికంగా నిషేధం విధించారు. ఇప్పుడు మరోసారి శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేసింది.