నైజీరియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
లాగోస్ నగరంలోని ఇకెజా ప్రాంతంలో బస్సు ప్రభుత్వ సిబ్బందిని విధులకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి ఇబ్రహీం ఫారిన్‌లోయ్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 90 మంది ఉన్నట్లు చెప్పారు.
బస్సును ఢీ కొట్టిన రైలు.. కొంత దూరం బస్సును ఈడ్చుకుని వెళ్లినట్లు పలువురు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే రెస్య్కూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. సిగ్నల్‌ను పట్టించుకోకుండా రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై లాగోస్ గవర్నర్ బాబాజిడే సాన్వో-ఓలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రానికి దయ మరియు రక్షణ కోసం ప్రార్థన చేద్దాం" అని ఆయన ట్వీట్ చేశారు.
నైజీరియా దేశంలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారం అయిపోయాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే అధికారులు జరిమానాలు విధిస్తున్నా, ప్రమాదాలు జరుగుతున్నప్పటికి అక్కడి ప్రజల్లో మార్పు రావడం లేదు.