జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి
హాంబర్గ్‌లోని జెహోవా విట్‌నెస్ సెంటర్‌లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ దుండుగు కాల్పులకు తెగబడ్డాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 10:48 AM ISTఘటనాస్థలంలో పోలీసులు
జర్మనీ దేశంలో కాల్పులు కలకలం సృష్టించాయి. హాంబర్గ్‌లోని జెహోవా విట్‌నెస్ సెంటర్‌లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులను అప్రమత్తం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొందని ఉందని తెలియజేస్తూ అలారం మోగించారు పోలీసులు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
వారంవారం నిర్వహించే బైబిల్ పఠనం కార్యక్రమంలో భాగంగా పలువురు డీల్‌బోజ్ వీధిలోగల మూడంతస్తుల చర్చి భవనంలో (యెహోవా విట్‌నెస్ సెంటర్) కి వచ్చారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగుడు భవనం నుంచి బయటికి పారిపోయినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని, కాబట్టి కాల్పుల అనంతరం దుండుగుడు తనను కాల్చుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కాల్పులపై ఓడరేవు నగర మేయర్ పీటర్ షెంచర్ ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయని చెప్పారు.