అరబ్ దేశాల్లో చిన్న నేరం చేసినా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడి ప్రభుత్వాలు బహిరంగానే శిక్షలు అమలు చేస్తుంటాయి. సౌదీ అరేబియా యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ మరణశిక్షలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గత పది రోజుల్లో 12 మందికి మరణశిక్ష విధించారు. వీరందరి తలలను నరికివేశారు. వీరిలో ఎక్కువ మంది మాదకద్రవ్యాల కేసులో దోషులు. జైలు శిక్ష పూర్తి అయిన తరువాత వీరికి ఈ శిక్ష విధించడం గమనార్హం.
మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు కాగా.. ముగ్గురు సౌదీ వాసులు ఉన్నారు. వీరితో కలిపి ఈ ఏడాది సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 132 మంది నేరస్తుల తలలను నరికివేశారు. 2020, 2021సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేసిన మరణశిక్షల కంటే ఇది ఎక్కువ అని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. 2018లో మహమ్మద్ బిన్ సల్మాన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ మరణశిక్షలను తగ్గించే విషయం పై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. జరల్నిస్ట్ జమల్ కషోగ్గి హత్య తరువాత మరణశిక్షను సవరించేలా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అయితే.. దీని అమలులో జాప్యం జరుగుతోంది.