అమెరికాలో మరోసారి జాత్యహంకార దాడులు ఎక్కువయ్యాయి. అమెరికాలోని ఆసియన్లపై దాడులు జరుగుతూ ఉండడంతో పలువురు ప్రముఖులు ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఏషియన్ అమెరికన్ స్వచ్ఛంద సంస్థల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 3 వేల ఘటనలు జరిగాయి. ఎఫ్బీఐ గణాంకాల ప్రకారం 2019లో కేవలం 216 ఘటనలే జరిగాయి. అమెరికాలోని ఆసియన్లపై జరుగుతున్న దాడులు భయాందోళన కలిగిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, పలువురు చట్ట సభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేష దాడులు, జాతి వివక్ష, హింసను ఖండించారు.
''ఏషియన్ అమెరికన్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న ఆసియా వాసులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన సమాజంలో ద్వేషం, జాతి, వర్గ వివక్ష, హింసకు చోటు లేదు. ఇలాంటి అన్యాయాలను ఎదుర్కొనేందుకు తోటి ఆసియా ప్రజలు, ఏషియన్ అమెరికన్లకు నేను తోడుగా నిలబడతా'' అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఏషియన్ అమెరికన్లపై దాడులను అరికట్టేందుకు వీలుగా చట్టాన్ని తీసుకొచ్చేందుకు పలువురు చట్ట సభ సభ్యులు భావిస్తూ ఉన్నారు అమెరికాలో ద్వేషం, హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదని తేల్చి చెప్పారు.
ఆసియా సంతతి వారిపై అమెరికాలో జరుగుతున్న దాడుల పట్ల పలువురు హాలీవుడ్ సెలెబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు అమెరికా సంస్కృతికి మచ్చను తీసుకుని వస్తాయని, ఇప్పటికైనా ఆపాలంటూ హితవు పలికారు.