కోలుకుంటున్న సల్మాన్
రష్దీపై దాడి చేసిన యువకుడి పేరు హాదీ మతార్. అతడి వయసు 24 ఏళ్లు.
By Medi Samrat Published on 14 Aug 2022 1:27 PM GMTన్యూయార్క్ లో కత్తిపోట్లకు గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు తాజాగా ఆయనకు వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. మాట్లాడగలుగుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. సల్మాన్ రష్దీ న్యూయార్క్ లోని చౌటాక్వా స్వచ్ఛంద విద్యాసంస్థలో ఓ సదస్సులో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా, హాదీ మతార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మెడ, ఉదరంలో కత్తిపోట్ల కారణంగా రష్దీ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఓ కన్ను కోల్పోయే ముప్పు ఎదుర్కొంటున్నారని వార్తలు వచ్చాయి.
రష్దీపై దాడి చేసిన యువకుడి పేరు హాదీ మతార్. అతడి వయసు 24 ఏళ్లు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అతడి ఫోన్ లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటో ఉండడాన్ని బట్టి, అతడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు సానుభూతిపరుడు అయ్యుంటాడని భావిస్తున్నారు. ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ గా పేరుగాంచిన ఖాసిమ్ సులేమానీ 2020లో హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో హాదీ మతార్ కు ఏ గ్రూపుతోనూ సంబంధాలు లేవని గుర్తించారు. అయితే, షియా అతివాద ధోరణుల పట్ల ఆకర్షితుడై ఉంటాడని అతడి ఫేస్ బుక్ పోస్టులు చెబుతున్నాయి. సొంత సిద్ధాంతాలతో ఒంటరిగానే కార్యాచరణకు దిగి ఉంటాడని భావిస్తున్నారు.
Next Story