ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు.

By Srikanth Gundamalla  Published on  8 Dec 2023 1:15 PM IST
Russia President, Putin, praises, PM Modi,

 ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు 

భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. నరేంద్ర మోదీ భారత దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. రష్యా, భారత్ మధ్య లోతైన బంధాలకు ఆయన విధానాలే గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన హిందీలో కూడా మాట్లాడారు. పలువురు భారతీయులతో పాటు.. ఇతరులు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ సందర్బంగా మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇండియా, ఆ దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావడం అసాధ్యమన్నారు. మోదీ ప్రభుత్వంపై అలాంటి ఒత్తిడి ఉంటుందని తనకు తెలుసన్నారు. అయితే.. ప్రజల కోసం మోదీ తీసుకునే కఠిన వైఖరిని చూసి కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంటుందని పుతిన్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్, రష్యా మద్య సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని పుతిన్ అన్నారు. మోదీ అనుసరిస్తోన్న విధానాలే అందుకు గ్యారెంటీ అంటూ పుతిన్‌ కొనియాడారు. హిందీలో పుతిన్ మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ మేధ సాయంతో అనువాదం చేయడం వల్లే అది సాధ్యమైందని ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన సంస్థ వెల్లడించింది.

ప్రధాని మోదీని పుతిన్‌ ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో మోదీని పుతిన్‌ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్‌ చాలా పురోగతి సాధించిందని అన్నారు. అలాగే మోదీ దేశ భక్తుడు అని అభివర్ణించారు పుతిన్. మేకిన్‌ ఇండియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా కీలకమైందన్నారు. భవిష్యత్‌ భారతదేశానిదే అని అన్నారు. వరల్డ్‌లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

Next Story