ఐస్‌లాండ్‌లో బ‌ద్ద‌లైన అగ్నిప‌ర్వ‌తం.. ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగిసిప‌డ్డ లావా

Reykjanes volcano in Iceland erupts as the night sky glows red.ఐస్‌లాండ్ రాజ‌ధాని రేకియావిక్‌కు స‌మీపంలో భారీ అగ్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 12:05 PM GMT
ఐస్‌లాండ్‌లో బ‌ద్ద‌లైన అగ్నిప‌ర్వ‌తం.. ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగిసిప‌డ్డ లావా

ఐస్‌లాండ్ రాజ‌ధాని రేకియావిక్‌కు స‌మీపంలో భారీ అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ద‌లైంది. ఎర్రటి రాతి నిప్పులు ఆకాశంలోకి ఫౌంటెయిన్ లా ఎగసిపడ్డాయి. అగ్గి కొండను జారి ఎర్రటి బాట కట్టాయి. సల సల కాగే లావా వరదై పారింది. ఆకాశంలోని మేఘాలు ఎరుపు వ‌ర్ణాన్ని త‌ల‌పించాయి. ఇది చూసిన జ‌నం భ‌యంతో బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డిపారు. శుక్ర‌వారం రాత్రి రాజ‌ధానికి 30కిలో మీట‌ర్ల దూరంలోని ఫాగ్రాద‌ల్స‌జాల్‌లో ఈ అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన‌ట్లు ఆదేశ వాతావ‌ర‌ణ విభాగం ధ్రువీక‌రించింది. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా ఆకాశం ఎర్రటి రంగును అద్దుకున్నట్టు కనిపించింది. అయితే.. దీని వ‌ల్ల ప్ర‌స్తుతానికి ఎటువంటి ముప్పులేద‌ని ఆదేశ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

అగ్నిప‌ర్వ‌తం తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లైజోన్‌గా ప్ర‌క‌టించారు. అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన ప్రాంతం స‌మీపంలోకి ప్ర‌జ‌లు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించిన‌ట్లు ఐస్‌లాండ్ అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించిందని, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందని చెప్పింది. ప్రజలెవరూ బయటకు రావొద్దని, ఎగిసిన పొగ వల్ల అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో గత నాలుగు వారాల్లోనే (నెలలో) 40 వేల భూకంపాలు వచ్చాయని అధికారులు చెప్పారు. అలాగే దాదాపు 800 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇది తొలి అగ్నిపర్వత విస్ఫోటనమని అధి​కారులు పేర్కొన్నారు.

ఇక 2010లో అగ్నిప‌ర్వ‌తం బద్దలైన ఘటనతో పోలిస్తే ఇది చాలా చిన్నదేనని చెబుతున్నారు. అప్పట్లో అగ్నిపర్వత పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు పొగ చిమ్మింది. దాని ప్రభావంతో 9 లక్షల విమానాలు ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే.
Next Story