ఒకే స్వాబ్ కిట్ తో పదే పదే పరీక్షలు.. చివరికి..

Repeated tests with a single swab kit.కోవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగించిన 'నాజల్ స్వాబ్ టెస్ట్ కిట్'లను కడిగేసి మళ్లీ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో కొంత మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 1:56 AM GMT
repeated tests with single swab kit

కోవిడ్ తో ప్రపంచం గడగడలాడించి పోతుంటే ఇదే సమయం అనుకుని డబ్బు సంపాదించే పనిలో పడిన అక్రమార్కులను అడుగడుగునా చూస్తున్నాం..ఇండోనేసియాలో ఇలాంటి సంఘటనే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగించిన 'నాజల్ స్వాబ్ టెస్ట్ కిట్'లను కడిగేసి మళ్లీ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో కొంత మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మేదన్‌లోని ఒక విమానాశ్రయంలో సుమారు 9 వేల మంది ప్రయాణికులను ఇలా ఒకసారి వాడేసిన కిట్‌లతోనే పరీక్షలు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇండోనేసియా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కిమియా ఫార్మాపై ప్రయాణికుల తరఫున కొందరు దావా వేయడానికి సిద్ధమవుతున్నారు.

నార్త్ సుమత్రా దీవుల్లోని మేదన్‌లో ఉన్న కౌలానాము విమానాశ్రయం కేంద్రంగా గత డిసెంబరు నుంచి ఇలా జరుగుతున్నట్టు సమాచారం.

అసలు విమాన ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ఉండాలి. ఈ విషయం మనందరికీ తెలుసు..ఇందుకోసం కొన్ని దేశాలలో రిపోర్టులు చూపిస్తే చాలు.. కానీ మేదన్ విమానాశ్రయం అక్కడే స్వాబ్ టెస్ట్‌లు చేస్తోంది. ఇందుకోసం యాంటిజెన్ ర్యాపిడ్ కిట్‌లను కిమియా ఫార్మా సరఫరా చేస్తోంది.

అయితే, కొందరు ప్రయాణికులు తమకు తప్పుడు పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు అనుమానిస్తూ ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఒక అండర్ కవర్ ఆఫీసర్‌ను పంపించారు. ఆ ఆఫీసర్ గత వారం ప్రయాణికుడిలా వెళ్లి గుట్టంతా బయటపెట్టారని మేదన్ స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది.

అండర్ కవర్ అధికారి అక్కడికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో మిగతా పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేశారు. రీసైకిల్ చేసిన కిట్‌లను పోలీసులు అక్కడ పట్టుకున్నారు.

పోలీసులు 23 మంది సాక్షుల నుంచి ఆధారాలు సంపాదించి 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్ గత డిసెంబర్ నుంచి జరుగుతుండటంతో నిందితులు భారీగా సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. ఈ కేసు నేపథ్యంలో కిమియా ఫార్మా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సంస్థకు చెందిన ఉద్యోగులను తొలగించింది.




Next Story