రియల్ లైఫ్ టార్జాన్ మృతి
Real life tarzan dies of liver cancer.వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు ఏకంగా 41
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2021 11:06 AM ISTవియత్నాంకు చెందిన ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు ఏకంగా 41 ఏళ్ల పాటు అడవిలోనే జీవించాడు. రియల్ లైఫ్ టార్జాన్‌గా పేరుగాంచాడు హో వాన్ లాంగ్. ఎంతో కాలం అడవిలో గడిపిన అతడు 8 సంవత్సరాల క్రితమే నాగరిక ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అయితే.. విషాదం ఏంటంటే.. ప్రజల్లోకి వచ్చిన తరువాత 52 ఏళ్ల వయసులో లివర్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు.
వియత్నాం యుద్ధం సమయంలో లాంగ్ చాలా చిన్నవాడు. అతడికి రెండేళ్ల వయసు ఉంటుంది. ఆ సమయంలో ఓ బాంబు అతడి ఇంటిపై పడింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు సోదరిమణులు ప్రాణాలు కోల్పోయారు. లాంగ్ తో పాటు అతడి తండ్రి, సోదరుడు కువాంగ్ ఎన్‌గాయ్ ప్రావిన్స్‌లోని టేట్రా జిల్లాలో ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు. చెట్లపైనా, గుహల్లోనూ నివసిస్తూ అక్కడ దొరికే వాటిని తింటూ నాలుగు దశాబ్దాలు గడిపారు.
2013లో అతని తండ్రి హో వాన్ థాన్ ఆరోగ్యం క్షీణించిన సందర్భంలో అతడి పెద్దన్న హో వాన్ ట్రి వినతి మేరకు లాంగ్, అతడి తండ్రి తిరిగి నాగరిక ప్రపంచంలోకి వచ్చారు. 2013లోనూ ఓ గ్రామంలో వాళ్లు అడుగుపెట్టినప్పుడు కూడా యుద్ధం ఇంకా కొనసాగుతోందని వాళ్లు భావించారు. ఆ తర్వాత 2017లో అతని తండ్రి మరణించాడు. ఇటీవల లాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్య పరీక్షల్లో అతడికి లివర్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. పరిస్థితి విషమించడంతో.. గత సోమవారం కన్నుమూశాడు.
అడవిలో సహజసిద్ధ ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్న లాంగ్.. బయటి ప్రపంచంలోని వచ్చిన తరువాత శుద్ధి చేసిన ఆహారాన్ని తినడం, మద్యం తాగడం వంటి కారణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని లాంగ్ స్నేహితుడు సెరెజో తెలిపారు.