బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూత

Queen Elizabeth II has died in Scotland aged 96 after battling health problems. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూశారు. 96 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో ఆమె కన్నుమూశారు.

By అంజి  Published on  8 Sep 2022 7:01 PM GMT
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూత

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూశారు. 96 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో ఆమె కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్ 2 గత అక్టోబర్ నుండి ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ స్కాట్లాండ్‌లో మరణించినట్లు రాయల్ ఫ్యామిలీ గురువారం ప్రకటించింది. అంతకుముందు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు స్కాట్లాండ్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు.

1922లో ఎలిజబెత్‌-2 జన్మించారు. 1947లో ప్రిన్స్‌ పిలిప్‌ మౌంట్‌ బాటెన్‌ను వివాహామాడిన ఎలిజబెత్‌-2.. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్‌ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్‌ రాజ కుటుంబం చరిత్రలోనే అత్యధిక కాలం పరిపాలకురాలిగా ఎలిజబెత్‌-2 కొనసాగారు. గత జూన్‌లో రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు చేశారు. ఈ సంవత్సరం ప్రపంచంలోనే అత్యధికంగా కాలం పాలించిన రెండో వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె హయాంలో 14 మంది ప్రధానులు పరిపాలన చేశారు.

గతేడాది అక్టోబర్‌ నుంచి రాణి ఎలిజబెత్‌-2ను ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఆమెకు నిలబడటం, కూర్చోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే ఆమె అప్పటి నుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉంటున్నారు. నిన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఆమె భర్త, ప్రిన్స్ ఫిలిప్, తన 100వ పుట్టినరోజుకు రెండు నెలల ముందు, 99 సంవత్సరాల వయస్సులో గత సంవత్సరం మరణించాడు.


Next Story