మహిళలూ 8 మందికి జన్మనివ్వండి.. రష్యా అధ్యక్షుడు విజ్ఞప్తి
రష్యాలో మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 8:16 AM GMTమహిళలూ 8 మందికి జన్మనివ్వండి.. రష్యా అధ్యక్షుడు విజ్ఞప్తి
రష్యాలో మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. ఈ క్రమంలో దేశ జనాభా సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో జనాభా సంక్షోభం ఏర్పడుతోంది. యుద్దం కారణంగానే రష్యన్లు చాలా వరకు విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దాంతో.. రష్యా జనాభా సంఖ్య తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని మహిళలు ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు.
వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో దేశ అధ్యక్షుడు పుతిన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ దేశంలో జనాభా సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే జనాభా సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రష్యా మహిళలకు ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్ విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలా మంది జాతుల ప్రజలు నలుగురు, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తున్నారు. మన పాత తరం వారు ఒక్కొక్కరు ఏడు, ఎనిమిది మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పుతిన్ అన్నారు. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే ప్రాధన లక్ష్యమని పుతిన్ చెప్పారు.
రష్యాలో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి జనాభా సంఖ్య నానాటి భారీగా తగ్గిపోతుంది. మరోవైపు 1990 నుంచి జననాల రేటు కూడా దాదాపుగా పడిపోయింది. ఒకవైపు జననాల రేటు పడిపోవడం.. మరోవైపు మరణాల రేటు పెరగడంతో రష్యాలో జనాభా సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి దేశం 3,00,000 కంటే ఎక్కువ మంది మరణించినట్లు ది ఇండిపెండెంట్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన అధికారులు జనాభా పెరుగుదల కోసం చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల్ని కనడంలో మహిళలను ప్రోత్సహిస్తున్నారు.