ఎయిర్‌షోలో ప్రమాదం.. గాల్లో ఢీకొన్న రెండు విమానాలు

పోర్చుగల్‌లో ఆదివారం ఎయిర్‌షో జరిగింది. ఈ షోలో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  3 Jun 2024 10:24 AM IST
portugal, air show, accident, two flight, pilot dead,

ఎయిర్‌షోలో ప్రమాదం.. గాల్లో ఢీకొన్న రెండు విమానాలు 

పోర్చుగల్‌లో ఆదివారం ఎయిర్‌షో జరిగింది. ఈ షోలో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో రెండు విమానాలు గాల్లో ఎగురుతుండగా ఢీకొన్నాయి. దాంతో.. ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పైలట్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వెంటనే స్పందించిన అధికారులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ పైలట్ పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు.

పోర్చుగల్‌లోని బెజా ఎయిర్‌పోర్టులో ఎయిర్‌షోను నిర్వహించారు అధికారులు. డజన్ల కొద్ది మిలటరీ విమానాలు, హెలికాప్టర్లు ఒక చోట చేరాయి. పైలట్లు తమ సాహసాలను మొదలుపెట్టారు. గాల్లో విమానాలను తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆరు విమానాలు ఒక లేన్‌లో ప్రదర్శన చేస్తున్న సమయంలో.. ఒక విమానం నేరుగా ఆ లేన్‌లోకి వేగంగా వెళ్లి మరో విమానాన్ని ఢీకొట్టింది. దాంతో.. ఆ విమానం రెక్క దెబ్బతిన్నది. ఆ తర్వాత వేగంగా వచ్చి కింద పడిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న ప్రేక్షకులు కొందరు రికార్డు చేశారు. ఈ సంఘటనతో వారు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు

కాగా.. విమానం ఢీకొని కుప్పకూలిన సంఘటనలో స్పెయిన్‌కు చెందిన పైలట్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు వెల్లడించారు. మరో విమానంలో ఉన్న పోర్చుగల్‌ పైలట్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని బెజా దవాఖానకు తరలించినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ప్రమాదానికి గురైన విమానాలు యాకొవెల్వ్ యాక్-2 అని.. రెండు విమానాలు సోవియట్ డిజైన్‌డ్‌ ఏరోబేటిక్‌ ట్రైనింగ్‌ మోడల్‌కు చెందినవని చెప్పారు. ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోవడం పట్ల పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Next Story