పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్క్సా ప్రపంచ సుందరిగా నిలిచింది. ప్యూర్టో రికోలో జరిగిన 70వ ఎడిషన్ మిస్ వరల్డ్ 2021 పోటిల్లో కరోలినా విజేతగా నిలిచింది. శాన్ జువాన్‌లోని కోకా-కోలా మ్యూజిక్ హాల్‌లో జరిగిన వేడుకల్లో 69వ ఎడిషన్ విజేత టోని ఆన్ సింగ్.. కరోలినాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరించింది. మొదటి రన్నరప్‌గా అమెరికాకు చెందిన శ్రీ సైనీ, కోట్ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్ రెండో రన్నరప్‌గా నిలిచింది. ఇక భారత్‌కు చెందిన మానస వారణాసి టాప్-6లో చోటు సంపాదించుకోలేకపోయింది. ఆమె టాప్-13లో 11వ స్థానంలో నిలిచింది.
టోనీ-ఆన్ సింగ్ నుంచి కిరీటం పొందిన తర్వాత.. కరోలినా బావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం మాట్లాడుతూ.. 'నా పేరు విన్నప్పుడు నేను షాక్ అయ్యాను, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించడం నాకు గౌరవంగా ఉంది. ప్యూర్టో రికోలోని ఈ అద్భుతమైన అధ్యాయాన్ని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను' అని చెప్పింది.
కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంటులో పీజీ చేస్తోంది. ఆ తరువాత పీహెచ్‌డీ చేస్తానని అంటోంది. చదువును కొనసాగిస్తూనే మోడల్‌గా పనిచేయాలనుకున్నట్లు చెప్పింది. బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ చేయడం అంటే ఇష్టం అని చెప్పింది.