విమానం గాల్లో ఉండగా నిద్రపోయిన పైలట్లు.. చివరకు..
విమానం గాల్లో ఉన్న సమయంలో ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. దాంతో విమానం దారి తప్పింది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 3:30 AM GMTవిమానం గాల్లో ఉండగా నిద్రపోయిన పైలట్లు.. చివరకు..
నిద్ర సరిగ్గా లేకపోవడంతో డ్రైవింగ్ చేస్తూ కనుకు వేసి రోడ్డు ప్రమాదాలకు కారణమైనవారు చాలా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏకంగా విమానం నడుపుతున్న పైలట్లే నిద్రపోయారు. విమానంలో ఒకరు కాదు.. ఇద్దరు పైలట్లు ఉంటారు. అయితే.. వారిద్దరూ నిద్రపోవడం సంచలనంగా మారింది. ఈ సంఘటన ఇండోనేషియాలో జరిగింది. జనవరి 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జనవరి 25వ తేదీన బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఏ320 విమానం 153 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బందితో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి ఆ దేశ రాజధాని జకర్తాకు బయల్దేరింది. సులవేసి నుంచి జకర్తాకు వెళ్లడానికి 2.35 గంటల సమయం పడుతుంది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ప్రధాన పైలట్‌కు బాగా నిద్ర వచ్చింది. దాంతో.. తాను కాసేపు నిద్రపోతాననీ.. నువ్వు చూసుకో అంటూ కోపైలట్‌కు చెప్పి అతను నిద్రపోయాడు. విమానం నియంత్రణను తీసుకున్న కాసేపటికే కోపైలట్ కూడా నిద్రపోయాడు. దాదాపు ఇద్దరూ అరగంట పాటు నిద్ర పోయారు. పైలట్లను సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రలో సెంటర్ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ.. ఏవీ సఫలం కాలేదు. దాంతో కంట్రోల్ సెంటర్‌లో ఉన్నవారంతా ఆందోళన చెందారు.
దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్ మేల్కొన్నాడు. అతను చూసే సరికి కోపైలట్ కూడా నిద్రపోతున్నాడు. కంగారుపడిపోయిన ప్రధాన పైలట్ వెంటనే అలర్ట్ అయ్యాడు. విమానం నిర్దేశిత మార్గంలో వెళ్లడం లేదని గ్రహించి.. కోపైలట్‌ను నిద్రలేపి కంట్రోస్ సెంటర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత విమానాన్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జకర్తా ఎయిర్‌పోర్టులో ఫ్లైట్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. పైలట్లు దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో 150 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై ఇండోనేషియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసింది.
విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు రోజు ప్రధాన పైలట్ నిద్రపోలేదని ప్రాథమిక విచారణలో తేల్చారు. అందుకే విమానం బయల్దేరిన గంటన్నర తర్వాత కోపైలట్ అనుమతితో కెప్టెన్ నిద్రపోయాడని విచారణలో తేల్చారు. విమానం నడిపే సిబ్బంది విశ్రాంతి విషయంలో తగిన శ్రద్ధ వహించాలని బాతిక్ ఎయిర్‌కు రవాణాశాఖ సూచించింది.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పింది.