చిన్నారులపై ఫ్రభావం చూపుతున్న ఫైజర్ టీకా
Pfizer vaccine affecting infants.తాము అభివృద్ధి చేసిన టీకా పిల్లల్లోనూ సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించింది.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2021 4:45 AM GMTఏదన్నా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు తన కంటే తమ పిల్లల గురించే ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికే ప్రయత్నిస్తారు. అయితే కరోనా విషయంలో ఇలాంటి చర్యలు ఏవి తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సులువుగా వ్యాపించడం వ్యాధి తీవ్రత పెరగడానికి కారణం అయితే అటు వ్యాక్సిన్ కూడా పెద్దలకు మాత్రమే పతయారుచేయబడింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో కీలక ముందడుగు పడింది. తాము అభివృద్ధి చేసిన టీకా పిల్లల్లోనూ సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించింది.
12-15 ఏళ్ల వయసు గల పిల్లల్లో తమ టీకా వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థ ఏర్పడినట్లు ఫైజర్ ప్రకటించింది. పెద్దల కంటే కూడా ఎక్కువ మోతాదులోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిపింది. అయితే, పెద్దల్లో ఉన్నట్లుగానే పిల్లల్లోనూ దుష్ప్రభావాలు ఉంటాయని స్పష్టం చేసింది. 12-15 ఏళ్ల వయసు గల 2,260 మంది పిల్లలకు టీకా అందించగా.. ఒక్కరిలోనూ కొవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల ఆరోగ్యాన్ని రెండేళ్ల పాటు పరిశీలిస్తామని పేర్కొంది.పిల్లల చదువులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఈ అప్‌డేట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాఠశాలలను తెరిచే విషయంలో ఇది ఓ ముందడుగు కానుందని ఫైజర్ అభిప్రాయపడింది.
ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పిస్తామని ఫైజర్ సీఈవో ఆల్బర్టా బోర్లా బుధవారం ప్రకటించారు. పిల్లలు కరోనా బారిన పడకుండా తమ టీకా అత్యధిక రక్షణ ఇస్తుందని బయోఎన్‌టెక్ కంపెనీ కూడా వెల్లడించింది. అత్యాధునిక ఎమ్ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా ఫైజర్ టీకాను అభివృద్ధి చేశారు. దీంతో అమెరికాతో పాటూ ఐరోపా సమాఖ్య కూడా 16 ఏళ్లు పైబడి వారిపై దీన్ని ఉపయోగించేందుకు అనుమతించాయి. ఇప్పటికీ వరకూ 65 దేశాల్లో లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ను అందించారు.
ఇటీవల ఇజ్రాయెల్‌లో 10.2 లక్షల మందిపై జరిగిన పరిశోధనలో ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావశీలత 95 శాతం నమోదైంది. ఈ ఏడాదిలో మొత్తం 2.5 బిలయన్ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యామని ఫైజర్ ప్రకటించింది. బ్రెజిల్, అమెరికాలో ఉన్న ప్లాంట్లలో ఈ టీకా ఉత్పత్తి వేగవంతంగా జరుగుతోంది. అయితే ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో వచ్చే విద్యాసంవత్సరం నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం.