మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ ప్రకటించింది. మిలటరీ నిధులను, బడ్జెట్‌లో కేటాయించి ఖర్చు కాకుండా మురిగిపోయిన నిధులను ఉపయోగించి ఈ గోడ నిర్మాణానికి గత ట్రంప్ ప్రభుత్వం పూనుకుంది. ఇదే ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ అమెరికా దక్షిణ సరిహద్దులోని ఈ గోడ నిర్మాణానికి నిధులు మళ్లించడం కోసం 2019లో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. గోడ నిర్మితమయ్యే వరకు దేశంలోకి అక్రమ వలసదారులు ప్రవేశించకుండా ఉండేందుకుగాను, సరిహద్దులో సైన్యాన్ని మొహరించడానికి కూడా ట్రంప్ వెనుకాడలేదు. అమెరికా–మెక్సికోలు 3,100 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటున్నాయి. అయితే ఇందులో 1600 కిలోమీటర్లకు మాత్రమే గోడ నిర్మించనున్నారు. మిగిలిన చోట్ల కంచె, అక్కడక్కడ సిమెంటు స్లాబులతో కట్టిన సరిహద్దు ఉంది.
అయితే జోబైడెన్ జనవరి 20న కొత్త అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టులన్నిటినీ ఆపేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అందచేస్తున్న నిధుల చట్టబద్ధతను, కాంట్రాక్ట్ పద్ధతులను సమీక్షించాలన్నారు. సైనికుల పిల్లలకు స్కూళ్ళ నిర్మాణానికి, విదేశాల్లో భాగస్వామ్య దేశాలతో కలిసి మిలటరీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడానికి, జాతీయ రక్షణ బలగాల, రిజర్వ్ బలగాల సామాగ్రి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి వుండగా వాటిని గోడ నిర్మాణానికి మళ్లించడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు పెంటగన్ ప్రతినిధి జమాల్ బ్రౌన్ తెలిపారు.తిరిగి వచ్చిన నిధులను వాయిదాపడిన సైనిక నిర్మాణ ప్రాజెక్టులకు ఉపయోగిస్తామని బ్రౌన్ చెప్పారు.