అగ్రరాజ్యం అమెరికా నల్లజాతీయుల విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో మనకి కాస్త తెలిసు. వారి జాతి వివక్షత బయట పడే లాంటి ఘటనలు మనకి అప్పుడో ఇప్పుడో తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా బయటపడిన ఘటన కూడా ఈ కోవకు చెందిందే. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక మ్యూజియం.. నల్లజాతి అమెరికన్ల పుర్రెలు సేకరిస్తూ వచ్చింది. ఇలా ఆ మ్యూజియం సేకరించిన పుర్రెలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
19 వ శతాబ్దపు ఫిలడెల్ఫియా వైద్యుడు మరియు మానవ శాస్త్రవేత్త శామ్యూల్ జి. మోర్టన్ పేరు మీద మోర్టన్ కలెక్షన్ మొదలు పెట్టారు. అతను వివిధ జాతుల మెదడు పరిమాణాలను పోల్చడానికి వందలాది పుర్రెలను సేకరించాడు. అతని పరిశోధనను "మేధోపరంగా, నైతికంగా మరియు శారీరకంగా అన్ని ఇతర జాతులకన్నా యూరోపియన్లు గొప్పవారని" తెలియచేయడానికి ఉపయోగిద్దాం అనుకున్నారట. అయితే 2019 లో కొంతమంది విద్యార్థులు ఈ విషయాన్ని బయటకు తెచ్చారు అంతే కాదు , ఈ సేకరణలో 55 పుర్రెలు హవానా, క్యూబా లేదా యుఎస్ లో బానిసలుగా ఉన్న వ్యక్తుల నుండి వచ్చాయని కనుగొన్నారు. విషయాలు బయట పడడం తో జూలై 2020 లో ఈ పుర్రెల సేకరణ విభాగం లోకి విజిటర్స్ ను అంగీకరించడం మానుకున్నారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
ఇప్పుడు మ్యూజియం ప్రజలను క్షమాపణలు కోరింది. ఇప్పటి వరకూ సేకరించిన పుర్రెలను కూడా వారి వారి సామాజిక వర్గాలకు అందజేస్తామని తెలిపింది. ఈ సేకరణకు దారి తీసిన కొలోనియల్ విధానాలను సంస్కరించి, ఇలా చేసినందుకు పశ్చాత్తాపంగా.. మ్యూజియంలో ఉన్న పుర్రెలన్నింటినీ ఎక్కడ కుదిరితే అక్కడ ఆ పుర్రెలకు సంబంధించిన కమ్యూనిటీలకు అందజేస్తాం అని మ్యూజియం డైరెక్టర్ పేర్కొన్నారు.