కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి
పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 24 May 2024 12:32 PM ISTకొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి
పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఓ గ్రామంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశంలోనే సంచలనంగా మారింది.
ఆ దేశ రాజధాని పోర్ట్ మోరెస్టీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ మీడియా పేర్కొంది. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కొండచరియలు.. ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్న వారిని బటయకు తీసుకొస్తున్నారు. ఎంత మంది మృతిచెందారనేదానిపై అధికారులు ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. వంద మంది కంటే ఎక్కువే మృతుల సంఖ్య ఉంటుందని చుట్టుపక్కల వారు అంటున్నారు. ఇక కొండచరియలు విరిగిపడ్డ సంఘటనలో తన కుటుంబంలో నలుగురు మృతిచెందారని ఓ విద్యార్థి వాపోయాడు.
తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో అందరూ నిద్రలో ఉన్నారు. దాంతో.. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మరోవైపు కౌకలం గ్రామం మొత్తం ధ్వంసం అయ్యింది. గ్రామం సమీపంలోనే పర్వతం ఉంది. ఈ పర్వతం పైనుంచే కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద ఉన్నవారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.