కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 2వేలకు చేరిన మృతులు
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 27 May 2024 8:02 AM GMTకొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 2వేలకు చేరిన మృతులు
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య పెరుగూతూనే ఉంది. తాజాగా అక్కడ మృతిచెందిన వారి సంఖ్యను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 2వేలకు పైగా మంది ప్రజలు చనిపోయినట్లు వివరించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ప్రభుత్వం కూడా ఐక్యరాజ్య సమితికి లేఖను విడుదల చేసింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం జరిగిందని పేర్కొన్నారు అదికారులు. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాల కుప్పలు పడినట్లు చెప్పారు. కాగా.. ఎంగా ప్రావిన్స్‌లోని ఎంబాలి గ్రామంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డ విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ఇంకా అక్కడ కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు శిథిలాల కిందనే ఉండిపోయిన వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. సహాయక బృందాలకు ఇది సవాల్‌గా మారుతోందని విపత్తు నిర్వహణ అధికారులు చెబుతున్నారు. ఇక కొండచరియల కింద ఇంకా ఇరుక్కున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సైన్యం, ఇతర బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మిత్ర దేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకుంటున్నట్లు పాపువా న్యూగిని ప్రభుత్వం వెల్లడించింది.
శుక్రవారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడి తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయని అధికారులు చెప్పారు. కానీ.. భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ ప్రమాదం దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు నిపుణులు.
మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు స్థానికులు కూడా రంగంలోకి దిగారు. పలుగు, పారలతో కొండచరియలను తవ్వుతున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేల మంది నిరాశ్రయులు కాగా.. 150 ఇళ్లు సజీవ సమాధి అయినట్లు చెప్పారు. ఇక మరికొన్ని వందల ఇళ్లు నివసించేందుకు వీలులేకుండా ధ్వంసం అయ్యాయి.