పాకిస్తాన్‌ను భయపెడుతున్న కాంగో వైరస్

పాకిస్థాన్‌లో కాంగో వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  25 Jun 2024 4:00 AM GMT
pakistan, congo virus, people panic ,

పాకిస్తాన్‌ను భయపెడుతున్న కాంగో వైరస్

పాకిస్థాన్‌లో కాంగో వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కాంగో వైరస్‌ కేసు నమోదు అయ్యింది. ఫాతిమా జిన్నా అనే 32 ఏళ్ల మహిళకు ఈ వైరస్‌ సోకింది. దాంతో ఆమెను వైద్యాధికారులు ఐసోలేషన్ వార్డులో చేర్చారు. ఆమె ఆరోగ్యాన్ని వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఐసోలేషన్‌లో వైరస్‌తో బాధపడుతున్న రోగి స్వస్థలం.. బలూచిస్తాన్‌లోని కిలా సైఫుల్లా జిల్లా వాసిగా తెలిసింది. మొత్తంగా ఈ ఏడాది పాకిస్థాన్‌లో 13 కాంగో వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు.. ఈ వైరస్‌ వల్ల పాకిస్థాన్‌లో గత నెలలో ఓ 18 ఏళ్ల యువకుడు మరణించాడు. అధిక జ్వరం, బాడీ పెయిన్స్‌, వాంతుల వంటి లక్షణాలతో అతను చనిపోయాడు. వైరస్‌ కారణంగా ఒకరు చనిపోవడం కలకలం రేపుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులు.. కనీస అవసరాలను తీర్చుకునేందుకే నానా కష్టాలు పడుతున్న దేశం. ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌లో కాంగో వంటి ప్రాణాలు తీయగల వైరస్‌ కలవరపెడుతోంది. దాంతో.. పాకిస్థాన్‌ దేశ ప్రజల్లో పెరిగిపోయింది. తాము ఈ వైరస్ బారిన పడితే పరిస్థితి ఏంటంటూ సామాన్య జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగో వైరస్‌ గురించి వైద్య నిపుణులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోగితో పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఈ వైరస్‌ను గుర్తించలేదని చెప్పారు. రోగితో కాంటాక్ట్‌ అయిన వారు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ వైరస్‌ పశువులు, మేకలు, గొర్రెలు, కుందేళ్ల వంటి జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని వారు చెబుతున్నారు. జ్వరం, కండరాల నొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, వాంతులు, వికారం, కడుపునొప్పి వంటివి ఈ వైరస్ లక్షణాలు. అయితే.. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నంటినీ కరోనా వైరస్‌ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో వైరస్‌ ద్వారా వచ్చే వ్యాధులు అంటేనే జనాలు ప్యానిక్‌ అవుతున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ఈ వైరస్‌ను ప్రభుత్వం కట్టడి చేయాలని.. ఇతర దేశాలకు పాకకుండా చూడాలని ఇతర దేశాల వారు సూచిస్తున్నారు.

Next Story