భారత్ ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసిన పాక్

Pak lifts ban on Indian products. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకొనే విషయంపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వీటి దిగుమతిపై దాదాపు రెండేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 5:34 AM GMT
Pak lifts ban on Indian products

పాకిస్తాన్తో భారత్ కు బంధాలు బలపడేలా ఉన్నాయి. దాయాది దేశం దారికొచ్చినట్టు కనిపిస్తోంది. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకొనే విషయంపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వీటి దిగుమతిపై దాదాపు రెండేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా, చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు మొగ్గు చూపింది.

ఇటీవల భారత్, పాక్ మధ్య వివిధ స్థాయుల్లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. కశ్మీర్ అంశంపై తాము చర్చల మార్గాన్నే కోరుకుంటున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారానికి అనువైన మార్గం ఏర్పడుతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.

కాగా ఆ లేఖ రాసిన మరుసటి రోజే పాక్ కీలక నిర్ణయం తీసుకుని భారత ఉత్పత్తుల దిగుమతికి మార్గం సుగమం చేసింది. తాజా అనుమతుల ప్రకారం... భారత్ నుంచి 0.5 మిలియన్ టన్నుల పంచదార దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పాక్ వ్యాపారులు ఇప్పటికే భారత్ లో పంచదార, పత్తి కొనుగోళ్లపై సంప్రదింపులు ప్రారంభించారు. ఇతర దేశాలతో పోల్చితే పత్తి, పంచదార భారత్ లోనే చవక అని పాక్ వ్యాపారులు భావిస్తున్నారు. ఈ చర్యతో దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా లబ్ధి చేకూరనుంది'

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత, పాక్ అన్ని వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని పాక్ చొరవ చూపడమే కాకుండా, పక్కాగా అమలు చేస్తోంది. దాంతో దాయాదుల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న ఆశలు చిగురిస్తున్నాయి.Next Story
Share it