ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తత.. 20 మంది మృతి, 305 మందికి గాయాలు
Over 300 Injured In Jerusalem.ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల సరిహద్దు నగరమైన జెరూసలెంలో ఉద్రికత్తలు
By తోట వంశీ కుమార్ Published on 11 May 2021 9:37 AM IST
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల సరిహద్దు నగరమైన జెరూసలెంలో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. సోమవారం జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంది. పాలస్తీనియన్లు రాళ్లు రువ్వగా.. వారిపై ఇజ్రాయిల్ పోలీసులు బాష్పవాయువు, రబ్బరు తూటాలను ప్రయోగించారు. స్టన్ గ్రేనేడ్లు సైతం ఉపయోగించారు. ఈ ఘటనల్లో 305 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. 228 మంది చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరగా.. మొత్తంగా ఇప్పటి వరకు 20 మంది ఈ ఘటనలో మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజా ఘర్షణల్లో 21 మంది పోలీసులతో పాటు ఏడుగురు ఇజ్రామెల్ పౌరులు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
తాజా ఉద్రిక్తలను మరింత పెంచుతా.. సోమవారం గాజా నుండి హమాస్ ముఠా జెరూసలెంపై రాకెట్ దాడులకు తెగబడింది. ఏడు రాకెట్లు నగరాన్ని తాకాయి. వాటి ధాటికి పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ముగ్గురు పిల్లలు సహా 9 మంది చనిపోయారు. జెరూ సలేంపై రాకెట్ దాడితో హమాస్ హద్దు మీరిందని, ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.
తూర్పు జెరూసలెంలోని షేక్ జరా జిల్లా తమదేనని యూదు సెటిలర్లు వాదిస్తున్నారు. అక్కడి నుంచి పాలస్తీనియన్ కుటుంబాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రయత్నాల నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా ఘర్షణలూ ఇందులో భాగమే. జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలతో పాటు యూదులకు కూడా ఇది పవిత్ర స్థలమే. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్, పాలస్తీనా వాసులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి.