ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతగానో టెన్షన్ పెడుతూ ఉంది. ఇప్పటికే చాలా దేశాలు సెకండ్ వేవ్ బారిన పడ్డాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం వీలైనంత త్వరగా చేపడితేనే కరోనా మహమ్మారికి చెక్ పెట్టొచ్చని వైద్యులు, నిపుణులు చెబుతూ ఉన్నారు. అందుకే టీకాల విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్, మెడెర్నా కోవిడ్ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు గుర్తించారు.
ఈ టీకాల తొలి డోసు తీసుకున్న రెండు వారాల్లోనే ఇన్‌ఫెక్షన్ రేటు 80 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇక రెండవ డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత ఇన్‌ఫెక్షన్ రిస్క్ 90 శాతం తగ్గినట్లు ఆ సర్వే చెప్పింది. సుమారు నాలుగు వేల మందిపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించామని.. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ( సీడీసీ) తెలిపింది.
భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త రూపాంతర వైరస్ (స్ట్రెయిన్) వేగంగా వ్యాపిస్తుండడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చితే మాత్రం ఇప్పటికీ ఇండియాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్నాయి. భారత్ లో ఇప్పటికి రెండు వ్యాక్సిన్లు వేస్తూ ఉండగా.. మూడో వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. కరోనా నివారణకు రష్యా రూపొందించిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వినియోగానికి భారత్‌లో త్వరలోనే అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏపీఐ, సర్వీసెస్ సీఈఓ దీపక్ సప్రా తెలిపారు. మరికొన్ని వారాల్లో భారత్‌లో వినియోగానికి అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు.
భారత్‌లో ఈ టీకాను సరఫరా చేసేందుకు 'రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)'తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్-వి కూడా రెండు డోసుల టీకానే.. తొలి డోసు ఇచ్చిన తర్వాత 21వ రోజు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 28 నుంచి 42 రోజుల మధ్య కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందట. ఈ వ్యాక్సిన్ 91.6 శాతం సామర్థ్యం కనబరిచినట్లు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైంది. ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా జరగొచ్చు.