కరోనా పై పోరులో వాక్సిన్ అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అయితే ఈ విషయంపై అవగాహన లేక ఎంతో మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి మొదట్లో విముఖత చూపారు. అప్పట్లో వ్యాక్సిన్ కు పబ్లిసిటీ ఇవ్వటం కోసం కొంతమంది వింత వింత ప్రయత్నాలు చేశారు. గుర్గావ్‌లోని ఒక పబ్ టీకా వేసుకున్న వాళ్లకి మందు ఫ్రీ గా ఇచ్చారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బంగారం ముక్కు పుడకలు, భోజనాలు, పంజాబ్లో అయితే రెస్టారెంట్ లలో డిస్కౌంట్లు ఇచ్చారు.
మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. వర్జీనియాలోని ఒక కాఫీ షాప్ టీకా వేసుకున్న వారికి $250 కూపన్ లు ఇస్తోంది. ఇజ్రాయెల్ లోని ఓ బార్, కొన్ని దుబాయ్ రెస్టారెంట్లు వినియోగదారులకు డిస్కౌంట్లు ప్రకటించాయి.
ఇప్పుడు తాజాగా ఏకంగా ఒహయో రాష్ట్ర గవర్నరే అక్కడి ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలోని యువత వాక్సినేషన్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని గుర్తించి వ్యాక్సిన్ వేసుకున్న వారిలో లక్కీ డ్రా లో ఎన్నికైన వారికి వారి ప్రతివారం ఒక మిలియన్ డాలర్ ప్రైజ్ ఇస్తామని ట్వీట్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన కనీసం ఒక డోసు తీసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలియజేశారు. మొదటివారం విజేతను మే 26న ప్రకటించనున్నారు. ఇక 17 ఏళ్ల లోపు వారికి మరొక ప్రత్యేకమైన లాటరీ ప్రకటించారు. ఇందులో విద్యార్థుల చేతికి డబ్బులు ఇవ్వరు గాని ఏడాదిపాటు స్కూల్ స్కాలర్షిప్ అందించనున్నారు.