ఆర్ధిక సంక్షోభం లో ఉత్తర కొరియా

North Korea in financial crisis.కరోనా లాక్‌డౌన్ తరువాత ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 2:31 AM GMT
Kim

కరోనా లాక్‌డౌన్ తరువాత ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కిమ్ అస్తవ్యస్థ ఆర్థిక విధానాలకు అమెరికా ఆంక్షలు తోడుకావడంతో ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. తమ దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా అంగీకరించారు. పోంగ్యాంగ్‌లో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ కీలక సమావేశంలో వేలాది మంది కార్యకర్తల ముందు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కిమ్ అధికారం చేపట్టి దశాబ్ద కాలం కావస్తున్న నేపథ్యంలో ఆయన క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

అస్తవ్యస్థ ఆర్థిక నిర్ణయాలు, అణ్వాయుధాల తయారీవల్ల అమెరికా పెట్టిన ఆంక్షలకు తోడు... కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉత్తర కొరియా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషిచేస్తున్నామన్నారు కిమ్. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించాలంటే... పార్టీ సెల్స్, క్షేత్రస్థాయి సంస్థల పనితీరే కీలకం... అని పేర్కొన్నారు. జనవరిలో పార్టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆయన పార్టీ సభ్యులను కోరారు.ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కిందిస్థాయి పార్టీ శ్రేణులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

అమెరికాలో నాయకత్వ మార్పు అనంతరం కిమ్ జోంగ్ ఉన్ దూకుడు పెంచారు. వరుస క్షిపణి పరీక్షలు చేపడుతూ గత కొంతకాలంగా అమెరికాతో పాటు పొరుగుదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్స్ ఇస్తూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు. తాము చేసిన కావ్వింపు చర్యలు కన్నా తమ దుస్థితికి అమెరికా ఆంక్షలే కారణమని ఉత్తర కొరియా నాయకత్వం మొదటి నుంచీ భావిస్తోంది. మరోవైపు తన అస్తవ్యస్థ ఆర్థిక విధానాలపై కిమ్ ఎలాంటి ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.


Next Story