కుప్ప‌కూలిన విమానం.. 8 మంది స్కై డైవర్లతో పాటు ఓ పైల‌ట్ మృతి

Nine found dead in Swedish airplane crash.స్వీడ‌న్‌లో ఘోర విమాన ప్ర‌మాదం చోటుచేసుకుంది. టేక్ఆప్ అయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 2:26 AM GMT
కుప్ప‌కూలిన విమానం.. 8 మంది స్కై డైవర్లతో పాటు ఓ పైల‌ట్ మృతి

స్వీడ‌న్‌లో ఘోర విమాన ప్ర‌మాదం చోటుచేసుకుంది. టేక్ఆప్ అయిన కొద్దిసేప‌టికే విమానం కుప్ప‌కూలింది. కుప్ప‌కూలిన వెంట‌నే విమానంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. ఒక‌రు తీవ్ర‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే.. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా.. అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది.

వివ‌రాల్లోకి వెళితే.. డీహెచ్‌సీ-2 టర్బో బేవర్‌ అనే స్కైడైవింగ్‌ విమానం ఒరెబ్రో విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరింది. ఆ విమానంలో 8 మంది స్కై డైవర్లు, ఓ పైలట్ ఉన్నారు. టేకాఫ్ స‌మ‌యంలో విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో విమానం ర‌న్‌వేకి స‌మీపంలోనే కుప్ప‌కూలింది. విమానం ముక్క‌లై కాలిపోయింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కొంద‌రి మృత‌దేహాలు పూర్తి కాలిపోయి గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోయాయని ఓ అధికారి తెలిపాడు.

ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు వెళ్లేసరికి 8 మంది మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ విమాన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించినట్లు సిజిటిఎన్ నివేదించింది. అయితే.. అత‌డు కూడా చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. .ఈ విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారికి స్వీడన్ ప్రధాన మంత్రి స్టీఫన్ లోఫ్వెన్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ ఘ‌ట‌న‌ స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో జ‌రిగింది. దీనిపై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story