ట్విట్టర్ బ్యాన్.. కారణమేంటంటే..?
Nigeria suspends twitter.ఇటీవల ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్న జాబితా సంఖ్య పెరుగుతోంది. తాజాగా
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2021 10:48 AM ISTఇటీవల ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్న జాబితా సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి ఆఫ్రికాలోని నైజీరియా చేరింది. ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. నైజీరియా దేశ అధ్యక్షుడు చేసిన ట్వీట్ ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేయడంతోనే బ్యాన్ చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్‌హాజి లాయ్ మొహ్మద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ దేశంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. దేశంలోని ఆగ్నేయం ప్రాంతంలో నివసించే కొంతమందిని ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు అధ్యక్షుడు బుహారీ ట్వీట్ చేశారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా వివాదాలకు కారణమవుతుండడంతో ట్విట్టర్ ఆ ట్వీట్ ను బుధవారం తొలగించింది. అంతేకాకుండా ఆయన ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. ట్విట్టర్ ఖాతాదారులకు సంబంధించిన మార్గదర్శకాలను అధ్యక్షుడు ఉల్లంఘించినందున.. తాము తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సమర్థించుకుంది.
బుహారీ పోస్ట్‌ను డిలీట్ చేసిన కారణంగా ట్విటర్‌ను బ్యాన్ చేస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి లాయి మహమ్మద్ తెలిపారు. అది కూడా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నామని ట్విట్టర్ లోనే పేర్కొనడం మరో వివాదంగా మారింది. అయితే దేశానికి మంచిది కాదని తాను భావించే అంశాలపై అభిప్రాయాన్ని వ్యక్తంచేసే హక్కు అధ్యక్షుడికి ఉంటుందని.. దీన్ని అభ్యంతరకర పోస్ట్‌గా ట్విట్టర్ ఎలా తొలగిస్తుందని ఆయన మద్ధతుదారులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలను పెద్ద ఎత్తున వాడుకోవడంపై నైజీరియా ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ను బ్యాన్ చేయడంతో పాటు దేశంలో సోషల్ మీడియా వేదికలకు లైసెన్స్ జారీ కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. నైజీరియా బ్రాడ్‌కాస్ట్ కమిషన్ ద్వారా ఈ లైసెన్స్ జారీని అమలు చేయనున్నారు. సోషల్ మీడియాను నియంత్రించేందుకే ఈ లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని నైజీరియా ప్రభుత్వ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయడమేనని అన్నారు.