లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడి.. ఎన్‌ఐఏ విచారణ

లండన్‌లోని భారత హైకమిషన్ ముందు గత నెలలో జరిగిన ఖలిస్తానీ అనుకూల నిరసనల ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

By అంజి
Published on : 18 April 2023 10:41 AM IST

London, NIA, Khalistan protests , Indian High Commission

లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడి.. ఎన్‌ఐఏ విచారణ

లండన్‌లోని భారత హైకమిషన్ ముందు గత నెలలో జరిగిన ఖలిస్తానీ అనుకూల నిరసనల ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇప్పుడు విచారణ చేపట్టనుందని వర్గాలు తెలిపాయి. వివరాల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఎన్‌ఐఏ దర్యాప్తును చేపట్టడానికి అనుమతించింది. ఇది గతంలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం క్రింద ఉంది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన అధికారిక కాపీని తమకు అందించాలని ఎన్‌ఐఏ స్పెషల్ సెల్‌ను కోరింది.

లండన్‌లోని భారత హైకమిషన్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘర్షణలపై హోం మంత్రిత్వ శాఖ యూకే ప్రభుత్వంతో మాట్లాడింది. వివరాల ప్రకారం.. 5వ భారతదేశం-యుకె హోం వ్యవహారాల సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మంత్రిత్వ శాఖల మధ్య ఖలిస్తానీ కార్యకలాపాలు, నిరసనలు చర్చించబడ్డాయి. న్యూ ఢిల్లీలో జరిగిన ఈ సంభాషణకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నాయకత్వం వహించగా, యూకే ప్రతినిధి బృందానికి హోం ఆఫీస్ శాశ్వత కార్యదర్శి సర్ మాథ్యూ రైక్రాఫ్ట్ నాయకత్వం వహించారు.

ఈ సమావేశంలో ఖలిస్తానీ కార్యకలాపాలపై నిశిత నిఘా ఉంచాలని, తదనుగుణంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్‌డమ్‌ను భారత్ కోరింది. భారత్‌లో ఖలిస్తానీ కార్యకర్తలు తీవ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నారని భారత్ పేర్కొంది. ఈ సమావేశంలో యూకేలో ఉగ్రవాద వ్యతిరేకత, సైబర్ భద్రత, ప్రపంచ సరఫరా గొలుసు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వలసలు, అప్పగింతలు, భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కొనసాగుతున్న సహకారాన్ని, అవకాశాలను, సినర్జీలను ఇరుపక్షాలు సమీక్షించాయి.

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి ఖలిస్థాన్ అనుకూల అంశాలు యూకే ఆశ్రయం హోదాను దుర్వినియోగం చేయడంపై భారతదేశం ప్రత్యేకించి ఆందోళనలను తెలియజేసింది. యూకేతో మెరుగైన సహకారం, యూకే ఆధారిత ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదుల పర్యవేక్షణను మెరుగుపరచాలని భారత్‌ పిలుపునిచ్చింది. గత నెలలో, లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని నిరసనకారుల బృందం వేర్పాటువాద ఖలిస్తానీ జెండాలను ఊపుతూ, ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు.

Next Story