ఈ ఏడాది నుండే న్యూయార్క్‌లో దీపావళికి సెలవు ప్రారంభం
ఇకపై దీపావళి రోజున న్యూయార్క్ లో సెలవుదినం అని అధికారులు ప్రకటించారు.
By News Meter Telugu Published on 27 Jun 2023 6:52 AM GMTఈ ఏడాది నుండే న్యూయార్క్‌లో దీపావళికి సెలవు ప్రారంభం
దీపావళిని హిందువులు అంతా ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దీపాల పండుగ అయిన దీపావళికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సెలవు దినంగా ప్రకటించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కూడా ఆరోజున పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. ఇకపై దీపావళి రోజున న్యూయార్క్ లో సెలవుదినం అని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది నుండి దీపావళి రోజున ఎంచక్కా ఇళ్లకే పరిమితం అవ్వొచ్చు. భారతీయ సమాజం సహా నగరవాసులు ఇది తమ విజయం అని చెబుతున్నారు. దీపావళిని న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్ కు సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర సెనేట్ బిల్లును ఆమోదించినందుకు గర్వంగా ఉందని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అన్నారు. త్వరలో గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేస్తారని మేము విశ్వసిస్తున్నామని చెప్పుకొచ్చారు. "ఇది భారతీయ కమ్యూనిటీ విజయం మాత్రమే కాదు.. ఇది న్యూయార్క్ సాధించిన విజయం" అని ఆడమ్స్ అన్నారు. ఇకపై ఈ సంవత్సరం నుండి న్యూయార్క్ నగరంలో దీపావళికి ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఉంటుంది.
న్యూయార్క్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్నుకోబడిన మొట్టమొదటి భారతీయ-అమెరికన్ మహిళ, న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా, దక్షిణాసియా, ఇండో-కరేబియన్ సమాజం ఈ క్షణం కోసం పోరాడిందని అన్నారు. "ఈ రోజు, మేయర్, నేను ప్రపంచం మొత్తం ముందు నిలబడి, దీపావళికి న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు అని చెప్పడానికి గర్వపడుతున్నాము." అని అన్నారు. “దీపావళి, మా నగరంలో గొప్ప సెలవుదినం అవుతుంది. న్యూయార్క్ నగరం అంతటా ఉన్న 6,00,000 మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన అమెరికన్లకు మా మద్దతు ఉంటుంది. భారతదేశం, గయానా, ట్రినిడాడ్, నేపాల్, బంగ్లాదేశ్ నుండి కుటుంబాల ఆకాంక్షలను గుర్తించాము. దీపావళి ఇకపై అమెరికన్ సెలవుదినం.. అమెరికా పౌర సమాజంలో హిందూ, సిక్కులు, బౌద్ధులకు ముఖ్యమైన స్థానం ఉంది.” అని ఆమె అన్నారు.
న్యూయార్క్ నగరం నిరంతరం మార్పు చెందుతూ ఉందని.. ప్రపంచం నలుమూలల నుండి కమ్యూనిటీలను స్వాగతిస్తున్నట్లు ఆడమ్స్ చెప్పారు. మా పాఠశాల క్యాలెండర్ లో కొత్త వాస్తవికతను ప్రతిబింబించాలి. అందరికీ గుర్తింపు దక్కాలని ఆయన అన్నారు. కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ వైస్ చైర్ పర్సన్ గ్రేస్ మెంగ్ మాట్లాడుతూ.. మేము దీపావళి రోజున పాఠశాల సెలవుదినం కోసం ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తూ ఉన్నామని.. మా ప్రయత్నాలు నెరవేతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మా పాఠశాల వ్యవస్థ గొప్పదని అన్నారు. న్యూయార్క్ లో దీపావళికి హాలిడే ఇవ్వడం.. దేశంలోని ఇతర నగరాలలో కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళికి సెలవుదినాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక రోజు సెలవు అని మాత్రమే పరిగణించకూడదని అన్నారు. ఈ నగరంలో సంస్కృతి, వైవిధ్యానికి చోటు ఉందని తెలిపారు. అందరినీ కలుపుకొనిపోవడానికి.. అన్ని నేపథ్యాల విద్యార్థులకు, న్యూయార్క్ వాసులు అందరికీ ఇది ఒక అవకాశమన్నారు. దీపావళిని ఫెడరల్ హాలిడేగా చేసేందుకు గత నెలలో మెంగ్ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు.