మంకీపాక్స్‌ పేరు మార్చండి.. డబ్ల్యూహెచ్‌వోకు ఆ నగరం విజ్ఞప్తి.. ఎందుకంటే?

New York Asks WHO To Rename Monkeypox. Because... ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్‌ కలవరం మొదలైంది. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మంకీపాక్స్‌ కేసులు

By అంజి  Published on  27 July 2022 6:45 AM
మంకీపాక్స్‌ పేరు మార్చండి.. డబ్ల్యూహెచ్‌వోకు ఆ నగరం విజ్ఞప్తి.. ఎందుకంటే?

ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్‌ కలవరం మొదలైంది. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటం.. స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా మంకీపాక్స్‌ వైరస్‌ పేరు మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు న్యూయార్క్‌ నగరం విజ్ఞప్తి చేసింది. సరైన ఆరోగ్య రక్షణ లేనివాళ్లు, ఈ పేరుతో మరింత ఆందోళనకు గురవుతున్నారని న్యూయార్క్ ప్రభుత్వం చెబుతోంది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఇతర నగరాల కంటే న్యూయార్క్‌లోని ఇప్పటివరకు 1,092 మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్లు వెలుగు చూశాయి. ఇప్పటికే మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

"మంకీపాక్స్‌పై వస్తున్న వదంతులు, సందేశాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది కచ్చితంగా దృష్టి సారించాల్సిన విషయం. ఇప్పటికే కొన్ని తెగలు రకరకాల వైరస్‌లు సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిది కూడా తోడైంది. ఆయా వర్గాల ప్రజల ఆందోళన తగ్గించాల్సిన బాధ్యత ఉంది. మంకీపాక్స్ వైరస్‌ ఓ వర్గ ప్రజల నుంచే సోకుతుందన్న సమాచారంతో కొందరు వర్ణవివక్ష చూపించే ప్రమాదముంది. అందుకే మంకీపాక్స్ పేరు మార్చాలి" అని న్యూయార్క్ సిటీ పబ్లిక్ హెల్త్ కమిషనర్ అశ్విన్‌ వాసన్‌.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్‌కు రాసిన లెటర్‌లో ప్రస్తావించారు.

'మంకీపాక్స్‌ వైరస్ పేరును మార్చాలనే ఆలోచనను డబ్ల్యూహెచ్‌వో గత నెలలో విలేకరుల సమావేశంలో తెలియజేసింది.' అని వాసన్ తన లేఖలో పేర్కొన్నారు. మంకీపాక్స్‌ వైరస్‌ కోతుల నుంచి రాలేదని, ఈ పేరుని అలాగే ఉంచితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని న్యూయార్క్‌ అధికార యంత్రాంగం అంటోంది. ''హెచ్‌ఐవీ వచ్చిన మొదట్లోనూ ఇలాంటి వదంతులే వ్యాపించాయి. ఓ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపించారు. కరోనా ఫస్ట్‌వేవ్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ 'చైనా వైరస్‌' అంటూ పదే పదే విమర్శలు చేశారు. దీంతో పలు దేశాల్లోని ఆసియా వాసులు వివక్ష ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా మంకీపాక్స్‌ పేరును కొనసాగిస్తే.. ఓ వర్గ ప్రజలు వివక్షకు గురి అయ్యే ఛాన్స్‌ ఉంది.'' అని వాసన లేఖలో తెలిపారు.

భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నలుగురు బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story