మయన్మార్.. నిరసనలతో న్యూ ఇయర్ వేడుకలు

New Year celebrations with protests.మయన్మార్ లో సైనిక హత్యలకు నిరసనగా ఐదు రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలు ను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 10:53 AM IST
Mayanmar new year celebrations

మయన్మార్ లో సైనిక హత్యలకు నిరసనగా ఐదు రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలు ను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణం గా తొలి రోజు బౌద్ధ విగ్రహాలను శుభ్రం చేసుకుని... ప్రార్థనలు చేస్తారు. కానీ దేశంలో పరిస్థితులు దృష్ట్యా ఆ వేడుకలను రద్దు చేసుకున్నప్పటికి, దేశంలో అత్యంత ప్రాథాన్యత కలిగిన పండుగ దినం కాబట్టి.. పూలతో ఎంతో అలంకరించిన కుండలను పట్టుకుని... కొత్త వస్త్రాలు ధరించిన మహిళలు పలు చోట్ల నిరసనలు తెలిపారు. అదేవిధంగా మూడు వెళ్ళు చూపించే విధంగా పెయింట్‌ను కుండలపై వేసి... వాటిని పట్టుకుని పీపుల్స్‌ పవర్‌, అవర్‌ పవర్‌ అంటూ మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

ఇక రెండో రోజు నిరసనగా.. ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాల వెలుపల, రహదారులపై రక్తపు మరకలను పెయింట్‌ వేశారు. సైనిక హత్యలకు వ్యతిరేకంగా... మిలటరీని అవమానించే లక్ష్యంతోనే... వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఇలా రెడ్‌ పెయింట్‌ వేశారు. ఆకులమీద నినాదాలు రాసి తోరణాలుగా కట్టారు. రాత్రి పూట పలు ప్రాంతాలలో హాట్ ఎయిర్ బెలూన్లు, కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలిపారు. అయితే కొన్ని చోట్ల నిరసనలలో హింస జరిగినప్పటికి ఆ విషయాలకు సంబంధించిన నివేదికలు లేవు. జుంటా సైన్యం అడ్డుకోవడం వల్ల.. సమాచారం కొరత ఏర్పడిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, సైనికులు పెత్తనం సాగిస్తున్నారు. ఫిబ్రవరి 1న మొదలైన సైనిక తిరుగుబాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యతిరేకిస్తున్న నిరసనకారులపై జుంటా సైన్యం తుపాకుల మోత మోగిస్తోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చునని, నర వధను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం విజ్ఞప్తి చేసింది. సూకీ ప్రభుత్వాన్ని కూల్చినప్పటి నుండి ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 710 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.




Next Story