పాకిస్థాన్‌లో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. కారణమిదే..
పాకిస్థాన్ న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla
పాకిస్థాన్‌లో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. కారణమిదే..
న్యూఇయర్ సందర్భంగా అన్ని దేశాల్లో వేడుకలు మిన్నంటుతాయి. ఆయా దేశాల టైమింగ్స్‌కు అనుగుణంగా వేడుకులు నిర్వహిస్తారు. అయితే.. పాకిస్థాన్ న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ వెనుక కారణం లేకపోలేదు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్థాన్ మరోసారి మద్దతు ప్రకటించింది. గాజా ప్రజలకు సంఘీభావంగా ఈసారి న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ మేరకు నూతన సంవత్సర ఈవెంట్స్‌పై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ప్రకటించారు.
గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని కాకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలస్తీనాలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. యుద్ధంలో నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపత్కర సమయంలో పాలస్తీనా సోదరులు, సోదరీమణులకు సంఘీభావంగా.. ఈసారి న్యూఇయర్ వేడుకులు జరపకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధంతో సతమతం అవుతోన్న పాలస్తీనాకు ఇప్పటికే తాము రెండుసార్లు మనవతా సాయం అందించామని చెప్పారు. అలాగే త్వరలోనే మరో విడత కూడా సాయం అందిస్తామని చెప్పారు పాకిస్తాన్ ప్రధాని కాకర్.
మరోవైపు గతకాలంగా పాకిస్థాన్‌లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. దాంతో.. ప్రజలు ఆహారం కోసం కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు ప్రపంచం మొత్తం చూసింది. సాధారణంగా న్యూఇయర్ వేడుకలను పాక్‌లో ఆర్భాటంగా చేయరు. ఒకవేళ చేసినా కొన్ని గ్రూపులు బలవంతంగా వాటిని అడ్డుకుంటారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కూడా చేశాం. ఈ క్రమంలో తాజాగా ప్రధాని కాకర్ చేసిన ప్రకటన పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై పాకిస్థాన్ వైఖరి మరోసారి తెలిసిపోయింది.