మనది కాని ప్రపంచంలో మరో విజయం..
Nasa's Mars helicopter succeeds.అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారక గ్రహం పై ఒక బుజ్జి హెలికాప్టర్‌ను విజయవంతంగా ఎగురవేసింది.
By తోట వంశీ కుమార్
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారక గ్రహం పై ఒక బుజ్జి హెలికాప్టర్‌ను విజయవంతంగా ఎగురవేసింది. ఇంజిన్యువిటీ అనే డ్రోన్ ఒక నిమిషం కన్నా తక్కువసేపు గాల్లో ఎగురగలిగింది. మనది కాని ప్రపంచంలో ఎగిరిన మొట్టమొదటి విమానం ఇదే. అందుకే దీన్ని ఒక గొప్ప విజయంగా నాసా భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రయోగంలో.. అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీని విజయవంతంగా ఎగిరినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది.
అంగారక గ్రహంపై ఉన్న ఒక శాటిలైట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ఉపగ్రహం హెలికాప్టర్ డాటాను భూమికి పంపించింది. భవిష్యత్తుల్లో మార్స్‌పై మరిన్ని విమానాలు సాహసోపేతంగా ఎగురుతూ కనిపిస్తాయని ఈ సందర్బంగా నాసా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంజినీర్లు ఈ హెలికాప్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన తరువాత ఇంజన్యువిటీని మరింత పైకి, మరింత దూరం ఎగురవేసే ప్రయత్నాలు చేస్తారని నాసా తెలిపింది. నిజానికి అంగారక గ్రహంపై గాలిలో ఎగరడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడి వాతావరణ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. భూమిపై సాంద్రతలో 1 శాతం మాత్రమే ఉంటుంది. అంతే కాదు మార్స్‌పై ఆకర్షణ శక్తి తక్కువగానే ఉంటుంది. కానీ, మార్స్ నేలపై నుంచి పైకి ఎగరడానికి చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది.
అందుకు రోటర్‌క్రాఫ్ట్ బ్లేడులు వేగంగా, శక్తివంతంగా తిరగాల్సి ఉంటుంది. ఈ కారణం తోనే ఇంజన్యువిటీని తేలికగా, 1.8 కిలోల అతి తక్కువ బరువుతో ఉండేట్లు రూపొందించారు, బ్లేడులు అత్యంత వేగంగా, నిముషానికి 2,500 రౌడ్లు తిరిగేంత శక్తిని సమకూర్చారు. భూమికి సుదూరంగా ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అన్వేషించడానికి ఇది గొప్ప ప్రారంభం అని నాసా భావిస్తోంది.
Witness the historic moment in full. The Mastcam-Z cameras on @NASAPersevere show us the takeoff, hovering and landing of the #MarsHelicopter. pic.twitter.com/ypdIWmC4D1
— NASA JPL (@NASAJPL) April 19, 2021
భవిష్యత్తులో వ్యోమగాములు మార్స్‌పై అడుగుపెట్టగలిగితే వారికి కూడా ఈ డ్రోన్‌లు సహాయపడతాయి. ఇక శని గ్రహానికి అతి పెద్ద ఉప గ్రహమైన టైటన్‌పై హెలికాప్టర్ మిషన్‌కు ఇప్పటికే నాసా ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌కు డ్రాగన్‌ఫ్లై అని పేరు పెట్టారు. 2030 దశాబ్దం మధ్యలో దీన్ని టైటన్‌పైకి పంపించేందుకు ప్రణాళిక తయారుచేస్తున్నారు.