కాలంలో వెనక్కి వెళ్లిన.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు ఏమైంది?
NASA’s James Webb Space Telescope hit by multiple micrometeoroids. విశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు, కాలంలో వెనక్కి వెళ్లి చూసేందుకు తయారు చేసిన సూపర్ టెలిస్కోప్ 'జేమ్స్ వెబ్'
By అంజి Published on 21 July 2022 1:18 PM ISTవిశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు, కాలంలో వెనక్కి వెళ్లి చూసేందుకు తయారు చేసిన సూపర్ టెలిస్కోప్ 'జేమ్స్ వెబ్' తీసిన ఫొటోలను నాసా ఇటీవల విడుదల చేసింది. ఈ ఫొటోలు ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు పేరుంది. అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా మారింది. అయితే తాజా రిపోర్ట్ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాను ఆందోళనకు గురి చేస్తోంది. ''జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బతింది. అది రాబోయే రోజుల్లో టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపుతుంది'' అని లేటెస్ట్ రిపోర్టులో తెలిసింది. కమీషనింగ్ ఫేజ్‌లో భాగంగా టెలిస్కోప్ పనితీరున శాస్త్రవేత్తల బృందం పరిశీలించిన సమయంలో ఈ విషయాన్ని ధృవీకరించింది.
సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాథమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది మే 22న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్ కారణంగా దెబ్బతింది. చివరి ఉల్క ఢీ కొట్టడంతో టెలిస్కోప్ అద్దం దెబ్బతింది అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఈ సమస్య చిన్నదే అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఎంత మేర నష్‌టం కలగజేస్తుందనే విషయంపై ఇప్పుడే ఒక క్లారిటీకి రాలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
టెలిస్కోప్ డ్యామేజ్ గురించి జేమ్స్ వెబ్ రూపకర్తలు స్పందించారు. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్‌లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో నాసా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి ఈ టెలిస్కోప్‌ను రూపొందించారు. ఈ టెలిస్కోప్ అద్దాలు భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఎల్2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో తిరుగుతూ ఫొటోలు తీస్తోంది.