త్వరలోనే స్పేస్ టు ఎర్త్.. 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్

నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 మిషన్‌ ఆదివారం ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది.

By Knakam Karthik  Published on  16 March 2025 7:48 PM IST
International, NASA, ISS, SpaceX, Sunita Williams, Butch Wilmore

త్వరలోనే స్పేస్ టు ఎర్త్.. 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ భూమి మీదకు తెచ్చే సమయం దగ్గర పడుతోంది. వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 మిషన్‌ ఆదివారం ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9:37 గంటలకు ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా (NASA) వెల్లడించింది. మరోవైపు దీనికి సంబంధించిన ఓ వీడియోను స్పేస్ఎక్స్ విడుదల చేసింది.

వారు తిరిగిరావడానికి అనువుగా, వారిని రిలీవ్ చేసేందుకు స్పేస్ ఎక్స్‌లో పంపిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. ఐఎస్ఎస్ చేరుకున్న నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తోపాటు అందులో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. తాజాగా అక్కడికి వెళ్లిన నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ స్థానంలో పనిచేయనున్నారు. క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ-10 మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్‌ మెక్‌క్లెయిన్, నికోల్‌ అయర్స్, జపాన్‌ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్‌ పెస్కోవ్‌లు ఉన్నారు. వీరందరూ ఆదివారం ఐఎస్‌ఎస్‌కు చేరుకొన్నారు. వీరికి సునీత, విల్మోర్‌ స్వాగతం పలికడం విశేషం.

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక 'స్టార్‌లైనర్‌'లో సునీత విలియమ్స్​, బుచ్ విల్మోర్​ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వాస్తవ ప్రణాళిక ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనితో వ్యోమగాములను తీసుకురాకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారిద్దరూ ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు క్రూ-10లో వీరు తిరిగి భూమిపైకి రానున్నారు.

Next Story