మయన్మార్‌పై విరుచుకుపడ్డ యాగి తుఫాన్.. వందల మంది మృతి
మయన్మార్‌పై యాగి తుఫాన్ విరుచుకుపడింది.
By Srikanth Gundamalla
మయన్మార్‌పై యాగి తుఫాన్ విరుచుకుపడింది. యాగి తుఫాన్ కారణంగా ఆ దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వరద పోటెత్తింది. ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిడుతున్నాయి. ఈ సంఘటనల్లో దాదాపు 220కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గల్లంతు అయ్యారని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇప్పటికే 6.30 లక్షల మంది ప్రకృతి విపత్తుతో ప్రభావితం అయ్యారని చెప్పారు అధికారులు.
మయన్మార్‌లో యాగి తుఫాన్ వల్ల సంభవిస్తున్న మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇక గతకొన్నేళ్ల నుంచి ఇంతటి దారుణ తుఫాన్ రాలేదనీ.. అత్యంత దారుణ వరదలు ఇవేని ఐక్యరాజ్యసమితి చెప్పింది. వరదలతో సతమతం అవుతోన్న మయన్మార్‌లో వరదల ధాటికి వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. రాజధాని నేపిడావ్ ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితం అయ్యింది. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరుతో పాటు ఆశ్రయం లేక అల్లాడిపోతున్నారు. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. మరోవైపు వరద బాధితులకు సహాయం చేయాలన్నా వరదలు.. వర్షాలు.. ఇలా రోడ్లు దెబ్బతినడం ఆటంకంగా మారింది. ఈ క్రమంలోనే తమకు సాయం చేయడానికి ముందుకు రావాలిన సైనిక పాలక వర్గం జుంటా విదేశాన్ని అభ్యర్థించినట్లు తెలిసింది. వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్‌లలో కూడా యాగి తుఫాన్ ప్రభావం ఉంది. అక్కడ కూడా భారీ వర్షాలు.. వరదలు సంభవిస్తున్నాయి.