దారుణం.. నైజీరియాలో 317 మంది విద్యార్థినుల కిడ్నాప్

More than 300 Nigerian schoolgirls kidnapped by gunmen in mass abduction.నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 3:17 AM GMT
దారుణం.. నైజీరియాలో 317 మంది విద్యార్థినుల కిడ్నాప్

నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. కొంత మంది దుండ‌గులు బాలిక‌ల పాఠ‌శాల‌లోకి చొర‌బ‌డి తుపాకుల‌తో బెదిరించి 317 మంది బాలిక‌ల‌ను కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని జాంగేబే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్‌కు గురైన బాలిక‌లంతా 10 నుంచి 13 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన వారే. స్థానిక కాల‌మానం ప్ర‌కారం శుక్రవారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జాంగేబ్‌లోని ప్రభుత్వ సెకెండరీ పాఠశాల దగ్గరకు వచ్చిన దుండగులు అక్కడే కొన్ని గంటల పాటు వేచి చూసి దాడి చేశారు. తమకు అడ్డు తగలకుండా స్కూల్‌కు దగ్గర్లోని సైనిక శిబిరం, చెక్‌పోస్టులపై కూడా దాడికి తెగబడినట్లు స్థానికులు తెలిపారు.

అయితే డబ్బు కోసం, జైలులో ఉన్న తమ సభ్యుల విడుదల కోసం బందిపోటు ముఠాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు జంఫారా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కిడ్నాప్‌కు గురైన బాలికలను రక్షించేందుకు జంఫారా పోలీసులు, నైజీరియా మిలిటరీ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. దుండగులు బాలికలను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి బంధించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే..విద్యార్థిల‌ను కిడ్నాప్ చేసే సమయంలో జరిపిన కాల్పుల్లో ఏమైనా ప్రాణ నష్టం సంభవించిందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

ఈ వారంలో ఇది రెండో ఘ‌ట‌న‌. మూడు రోజుల క్రితం బోకోహారం ఉగ్ర‌వాద ముఠాకు చెందిన వారుగా అనుమానిస్తున్న కొంద‌రు దుండ‌గులు మిల‌ట‌రీ దుస్తుల్లో వ‌చ్చి ఓ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు, టీచర్లు సహా 42 మందిని దుండగులు అపహరించారు. ఇక 2014 ఏప్రిల్‌లోనూ ఓ స్కూల్‌ నుంచి 276 మంది బాలికలను అపహరించుకుపోయారు. వారిలో వంద మందిపైగా బాలిక‌ల ఆచూకీ ఇంకా ల‌భించ‌లేదు.




Next Story