అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి.. బెర్క్లీ కొండల్లో లభ్యమైన మృతదేహం!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By - అంజి |
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి.. బెర్క్లీ కొండల్లో లభ్యమైన మృతదేహం!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫిబ్రవరి 9 నుంచి అదృశ్యమైన సాకేత్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ధృవీకరించింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీలో మాస్టర్స్ చదువుతున్న సాకేత్, గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడు. చివరిసారిగా అతను బెర్క్లీ హిల్స్ ప్రాంతంలోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, అతని ఆచూకీ కోసం వెతుకుతుండగా.. ఒక ఇంటి గుమ్మం వద్ద సాకేత్ బ్యాక్ ప్యాక్ లభ్యమైంది. అందులో అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది.
సాకేత్ శ్రీనివాసయ్య విద్యాపరంగా ఎంతో ప్రతిభావంతుడు. అతను IIT మద్రాస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ (2025 బ్యాచ్) పూర్తి చేశాడు. ప్రస్తుతం బెర్క్లీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. సాకేత్ మృతిపై భారత రాయబార కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది. "సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభ్యమైందని స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం" అని ఎక్స్ (X) వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం సాకేత్ మరణానికి గల కారణాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు మరణిస్తుండటం ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది.