టర్కీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్నేయ టర్కీలోని బిట్లిస్ ప్రావిన్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ కూడా ఉన్నారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న మధ్యాహ్నం 2.25గంటల ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలినట్లు గుర్తించారు. హెలికాప్టర్‌లో మొత్తం 13 మంది సైనికులు ఉన్నారు.
హెలి కాప్టర్ బయలు దేరిన 30 నిమిషాల తరువాత బిట్లిస్ ప్రావిన్యు ప్రాంతంలో హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయని.. ప్రావిన్యులోని పర్వత ప్రాంతంలో మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని టర్కీ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఘటనా స్థలంలోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఇద్దరు సైనికులకు చికిత్స అందుతోంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.