మెక్సికో సైనిక దాడి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో హతం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, 'మెక్సికో మోస్ట్ వాంటెడ్' నేరగాడు నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్..
By - అంజి |
మెక్సికో సైనిక దాడి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో హతం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, 'మెక్సికో మోస్ట్ వాంటెడ్' నేరగాడు నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ (అలియాస్ ఎల్ మెంచో) మరణించినట్లు మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. సైనిక ఆపరేషన్‌లో గాయపడిన అతను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు.
పశ్చిమ మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో సైన్యం జరిపిన మెరుపు దాడిలో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హెలికాప్టర్ ద్వారా మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. గత దశాబ్ద కాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అనే శక్తివంతమైన నేర సామ్రాజ్యానికి ఇతనే సూత్రధారి.
తన నాయకుడి మరణ వార్త తెలియగానే CJNG ముఠా సభ్యులు మెక్సికోలోని సగానికి పైగా రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగారు. తుపాకీధారులు ప్రధాన రహదారులపై వాహనాలను తగులబెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. పర్యాటక ప్రాంతమైన ప్యూర్టో వల్లార్టాలో ఆకాశాన్ని తాకుతున్న పొగలు, గ్వాడలజారా నగరంలో తగులబడుతున్న వాహనాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. జాలిస్కో రాజధానిలో కాల్పుల శబ్దం వినబడగానే విమానాశ్రయంలో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షైన్‌బామ్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎల్ మెంచో మరణం అమెరికాకు ఒక పెద్ద ఊరట. అమెరికాలోకి భారీ ఎత్తున కొకైన్, మెథాంఫేటమైన్ మరియు ప్రాణాంతకమైన ఫెంటానిల్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు ఇతనే. ఇతని ఆచూకీ తెలిపిన వారికి అమెరికా గతంలో 15 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గత ఏడాదే CJNGను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ ఈ పరిణామాన్ని లాటిన్ అమెరికా దేశాలకు శుభపరిణామంగా అభివర్ణించారు.
ప్రయాణికులకు హెచ్చరికలు:
మెక్సికోలో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా దేశాలు తమ పౌరులకు సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశాయి. జాలిస్కో, మిచోకాన్, గెరెరో వంటి రాష్ట్రాల్లో ఉన్న వారు ఇళ్లకే పరిమితం కావాలని సూచించాయి.
ఎవరీ ఎల్ మెంచో?
ఒకప్పుడు సాదాసీదా ముఠాగా ఉన్న CJNGని ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నేర సామ్రాజ్యంగా మార్చాడు ఎల్ మెంచో. సైనిక తరహా ఆయుధాలు, భారీ కాన్వాయ్‌లతో తన ప్రత్యర్థులను, అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ఇతని శైలి. ఒకప్పుడు 'ఎల్ చాపో' నేతృత్వంలోని సినలోవా కార్టెల్ ఎంతటి భీభత్సాన్ని సృష్టించిందో, ఇప్పుడు అంతకంటే మించిన స్థాయిలో 'ఎల్ మెంచో' తన అరాచకాలను కొనసాగించాడు.