కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని అత్యవసర వినియోగం కింద పలు దేశాలు అనుమతించడంతో.. ఆయా దేశాల్లో వాక్సిన్ల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాను తీసుకున్న ఓ మెక్సికో వైద్యుడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మ సంబంధిత అలర్జీ వంటి లక్షణాలు గుర్తించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక పరీక్షల్లో దీన్ని ఎన్సెఫలోమైలిటిస్ గా గుర్తించారు. మెదడు, వెన్నముకలో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఈ సమస్యలు వస్తాయని మెక్సికో ఆరోగ్య శాఖ తెలిపింది. ఫైజర్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లలో ఈ దుష్ప్రభావం తలెత్తలేదని వివరించారు. అయితే.. గతంలో పలుమార్లు ఆ వైద్యుడు అలర్జీల బారిన పడ్డారని అన్నారు. కాగా.. దీనిపై ఫైజర్‌గానీ, బయోఎన్‌టెక్‌గానీ స్పందించలేదు. ఇప్పటి వరకు మెక్సికోలో 1,26,500 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 24 నుంచి అక్కడ టీకా ఇవ్వడం ప్రారంభించారు.
ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్ప ప్రతికూలతలు, దుష్ప్రభావాలు తలెత్తడం సహజమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్ ఎదుర్కొనేందుకు ఇస్తున్న టీకా తీసుకున్న పలువురికి దుష్ప్రభావాలు అక్కడక్కడా తలెత్తుతున్నాయి. వారం రోజుల కిందట అమెరికాలో మోడెర్నా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైద్యుడుకి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించిన సంగతి తెలిసిందే.