అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌లపై మెటా సంస్థ భారీ అణిచివేత చర్యలు చేపట్టింది. ఆగ్నేయాసియా కేంద్రంగా సాగుతున్న సైబర్ స్కామ్ కార్యకలాపాలకు చెక్ పెడుతూ దాదాపు 1,50,000 కంటే ఎక్కువ ఖాతాలను నిలిపివేసింది. రాయల్ థాయ్ పోలీస్ యాంటీ-సైబర్ స్కామ్ సెంటర్‌తో పాటు పలు దేశాల చట్ట అమలు సంస్థల సమన్వయంతో నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌లో, స్కామ్ నెట్‌వర్క్‌లతో సంబంధమున్న 21 మందిని థాయ్ అధికారులు అరెస్టు చేశారు.
ముఖ్యంగా మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో చట్టబద్ధమైన వ్యాపారాల ముసుగులో ఈ స్కామ్ సెంటర్లు నడుస్తున్నట్లు మెటా గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌లు అత్యంత అధునాతన పద్ధతుల్లో రొమాన్స్ స్కామ్‌లు, క్రిప్టోకరెన్సీ మోసాలు మరియు పోలీసు అధికారులమని నమ్మిస్తూ ప్రపంచవ్యాప్తంగా బాధితులను నిలువునా ముంచుతున్నాయి. ఈ భారీ అణిచివేత ద్వారా ఇలాంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.